సందడి చేద్దాం.. సరదా తెద్దాం

27 Dec, 2014 04:10 IST|Sakshi
సందడి చేద్దాం.. సరదా తెద్దాం

ఏలూరు సిటీ : గడియారం తన పని తాను చేసుకుపోతోంది. 2014 సంవత్సరం చరిత్ర పుటల్లో కలిసిపోవడానికి.. 2015 ఆగమనానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలైతే చాలు జనం ఆనందానికి అవధులు ఉండవు. చిన్నాపెద్దా.. పేద, ధనిక.. ఉద్యోగులు, వ్యాపారులు.. కుల మత భేదాలు లేకుండా సంబరాలు చేసుకునే ఘడియలవి. దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువత రెడీ అవుతోంది.

స్నేహాన్ని.. ప్రేమను.. అనుబంధాన్ని.. ఆప్యాయతలను చాటుకునేందుకు..  బహుమతులు ఇచ్చి పుచ్చుకునేందుకు.. కొంగొత్త ఆశలతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు.. రంగుల లోకాన్ని ఆవిష్కరించేందుకు యువత ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. వినోదాల పండగలాంటి ఈ అర్ధరాత్రి సంబరం విషాదం కాకూడదంటే ఏం చేయాలనే విషయమై ఏలూరు యువతుల మనోగతం...
 
సంతోషంగా గడపాలి
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పండగ చేసుకునే వేళ అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. సెలబ్రేషన్స్ పేరుతో వేధింపులు, గొడవలు చేయడం తగదు. స్నేహానికి విలువ ఇస్తూ.. ఇతరులను గౌరవించేలా.. ఎదుటి వారి ఆకాంక్షలు నెరవేరేలా శుభాకాంక్షలు చెబుతూ వేడుకలు చేసుకుంటే మంచిది. అన్నయ్యలూ.. తమ్ముళ్లూ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను హుందాగా జరుపుకుందాం. ఓకేనా.
-  జి.చంద్రిక
 
తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకోవడం తప్పు కానే కాదు. కానీ.. దాని పేరుతో మోటార్ సైకిళ్లను సెలైన్సర్లు తీసేసి నడపటం వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇళ్లుల్లో ఉండే వృద్ధులు, చంటిపిల్లలు, గుండె వ్యాధితో బాధపడే వ్యక్తులు తీవ్ర ఇబ్బంది పడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. ఎదుటి వారి క్షేమాన్ని కోరి శుభాకాంక్షలు చెప్పుకునే వేళ తోటి వాళ్లను ఇబ్బంది పెట్టడం.. ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదు.
- మమత
 
జీవితం విలువను గుర్తించాలి
జీవితం చాలా విలువైంది. దానిని జాగ్రత్తగా మలుచుకుంటేనే జీవితాంతం సంతోషం, ఆనందం ఉంటాయి. క్షణిక ఆనందం కోసం మనం చేసే సం దడి హద్దులు దాటితే ప్రమాదాల బారినపడతాం. దీనివల్ల మనతోపాటు మన కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టిన వాళ్లం అవుతాం. మనం చేసుకునే వేడుకల వల్ల ఆనందం, ఉత్సాహం రెట్టింపు అవ్వాలే తప్ప వీసమెత్తు విషాదం పలికినా ఇబ్బందే. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా.
- కావ్య
 
హరివిల్లు కావాలి
కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు రంగుల హరివిల్లులా మారాలి. విద్యార్థులు చదువులోను, ఉద్యోగులు, వ్యాపారులు తమ విధుల్లోను.. అన్ని రంగాల్లోని వ్యక్తులు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలి.  కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. మనలో ఉన్న ఒక్క లోపాన్ని అయినా గతించిపోయే పాత సంవత్సరానికి వదిలేస్తే.. వచ్చే ఏడాది ఎంతో బాగుంటుంది.
- స్వాతి
 
అలా చేయొద్దు

డిసెంబర్ 31న రాత్రి నుంచి కొత్త సంవత్సరం రాక కోసం ఎదురు చూస్తూ అంద రం ఆనందంగా గడుపుతాం. అలాంటి వేళలో కొందరు యువకులు మద్యం సేవించి గొడవలు పడటం.. రోడ్లపై వెళ్లేవారిని అల్లరి పెట్టడం.. బైక్‌లు వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడటం వల్ల వారిని చుట్టుపక్కల వాళ్లు తిట్టుకుంటారు. పండగ వేళ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం.. వారితో తిట్లు తినడం మంచిదంటారా. ఏడాదంతా బాగుండాలంటే తొలి రోజున నలుగురూ మెచ్చేలా ఉంటే బాగుంటుంది.   - అనూష
 

హద్దు మీరితే అరెస్ట్ చేస్తాం
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరైనా హద్దు మీరితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. మహిళలు, యువతులు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే  కఠిన చర్యలు తప్పవు. యువత కొత్త సంవత్సరం పండగను ఉత్సాహంగా చేసుకోవడం తప్పు కాదు. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. సెలైన్సర్లు తొలగించి మోటార్ సైకిళ్లు నడిపితే సహించేది లేదు. వాహనాలను అత్యంత వేగంగా నడపటం వల్ల ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని నష్టపోతారు. ఈ విషయాన్ని యువత గమనించాలి. ఫ్రెండ్స్.. మీరంతా డిసెంబర్ 31 వేడుకల్ని సంతోషంగా జరుపుకోండి.  విషాదాలకు, వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించండి. తద్వారా అందరిలో సంతోషం నింపేవిధంగా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
- కె.రఘురామ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు