శిశువు ప్రాణం తీశారు

12 Jun, 2019 11:05 IST|Sakshi
మృతి చెందిన శిశువు

సాక్షి ,బొమ్మలసత్రం(కర్నూలు): నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు ప్రాణం తీసింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మకు నెలలు నిండటంతో భర్త దేవదాసు కాన్పు కోసం సోమవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆమెకు పరీక్షలు నిర్వహించి బిడ్డ ఆరోగ్యం బాగుందని రాత్రిలోగా కాన్పు చేస్తామని చెప్పారు. రాత్రంతా చూసినా పురిటి నొప్పులు రాలేదు.

ఉదయం కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెన్నమ్మ బాత్‌రూంకు వెళ్లగా అందులో నీరులేదు. దీంతో ఆమె మెట్లు దిగి  కింద అవుట్‌ పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌కు నడుచుకుంటూ వెళ్లింది.  అక్కడే కాన్పు కావడంతో సిబ్బంది తల్లీబిడ్డను కాన్పుల వార్డుకు తరలించారు. అయితే,  డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ముందుగానే  ఇంటికి వెళ్లిపోయింది.  దీంతో చికిత్స అందించే వారు ఎవరూ లేక  ఉమ్ము నీరు తాగిన పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది.  

వైద్యులే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు  
వైద్యుల నిర్లక్ష్యమే  తమ బిడ్డ మృతికి కారణమని చెన్నమ్మ, దేవదాసు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాన్పు సమయంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మూడేళ్ల క్రితం చెన్నమ్మ మొదటి కాన్పు కోసం 108లో వస్తుండగా మార్గమధ్యంలోనే
ప్రసవమైంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకునే వచ్చేలోగా మృతిచెందినట్లు ఆ దంపతులు గుర్తుచేసుకుని బోరున విలపించారు.

వైద్యురాలిపై విచారణకు ఆదేశించాం
డ్యూటీలో వైద్యురాలు లేక పోవటంతో  బిడ్డ మృతి చెందినట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో డాక్టర్‌పై విచారణకు ఆదేశించాం.  వైద్యురాలు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –విజయ్‌కుమార్, సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు