నవ వధువు బలవన్మరణం

26 Aug, 2013 04:16 IST|Sakshi

 కుల్కచర్ల, న్యూస్‌లైన్: ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి.. తమ్ముళ్లను బాగా చదివించండి. నా భర్త చాలా మంచోడు.. నాకు జీవితంపై విరక్తి కలిగింది. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ నవవధువు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కుల్కచర్ల మండలం చాకల్‌పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకల్‌పల్లికి చెందిన యాదమ్మ(20)ను అదే మండలంలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన బంధువు శ్రీనివాస్‌కిచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. యాదమ్మ మహబూబ్‌నగర్ జిల్లా నవాపేట్‌లోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతుండగా శ్రీనివాస్ మహబూబ్‌నగర్‌లో ఐటీఐ చేస్తున్నాడు.
 
 దంపతులు చాకల్‌పల్లిలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో భోజనం చేసి నిద్రపోయారు. శ్రీనివాస్ శనివారం ఉదయం లేచి చూడగా భార్య కనిపించలేదు. గ్రామంతోపాటు బంధువుల వద్ద ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో ఆదివారం ఉదయం చాకల్‌పల్లి చెరువులో యాదమ్మ మృతదేహం కన్పించింది. మృతురాలి తల్లి మాణెమ్మ సమాచారంతో పోలీసులు చెరువులోంచి మృతదేహాన్ని వెలికితీయించి పరిశీలించారు. ఇంట్లో పంచనామా చేయగా యాదమ్మ పుస్తకంలో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది.
 
 తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని, తన భర్త చాలా మంచోడంటూ అందులో పేర్కొంది. దంపతులు అన్యోన్యంగా ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు యాదమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మాణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సలీం తెలిపారు.

మరిన్ని వార్తలు