అంతర్మథనం

6 Sep, 2013 04:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజాభిప్రాయానికి పట్టం కట్టిన వైఎస్సార్‌సీపీ వెంట జనం కదం తొక్కుతుండటం కాంగ్రెస్, టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జనాభీష్టం మేరకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పాదయాత్రకు జనం ఉప్పెనలా కదలిరావడం టీడీపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. తమ మనోభిప్రాయాలను గౌరవిస్తూ.. ఓట్లు, సీట్లను పక్కన పెట్టి.. తెలుగు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్ర ఉద్యమపంథాను ఎంచుకోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోండటం ఇరు పక్షాలను మరింత ఇరకాటంలోకి నెడుతోంది.
 
 ప్రజాభీష్టాన్ని తుంగలోతొక్కి.. ఓట్లు, సీట్లే లక్ష్యంగా.. అధికారమే పరమావధిగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే జనం ఇలానే తిరుగుబాటు చేస్తారని కాంగ్రెస్, టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 2008లో టీడీపీ మహానాడులో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి టీడీపీ పోటీచేసింది.
 
 కానీ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం ముందు మహాకూటమి కుప్పకూలింది. 2009 సెప్టెంబరు 2న మహానేత వైఎస్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసం వేర్పాటువాదాన్ని రాజేశాయి. ఆ క్రమంలోనే తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండు కళ్లు వంటివని అభివర్ణించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. లేఖ ఇవ్వడంపై సీమాంధ్ర ప్రజానీకం మండిపడింది. ఆ లేఖ ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఇది సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలే ప్రధాన కారణమంటూ ఆ రెండు పక్షాల నేతలనూ జిల్లా ప్రజానీకం ఎక్కడికక్కడ అడ్డుకుని, నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు గౌరవించలేదు.
 
 జనాభిప్రాయాన్ని గౌరవించేలా ఆ పార్టీల అధిష్టానాలను అంగీకరింపజేయడంలో ఇరు పక్షాల ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఇది ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి.. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేశారు. జైల్లో ఉన్నా తెలుగు ప్రజల ఐక్యత కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారు. తెలుగు ప్రజలను చైతన్యపరచి.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర కోసం షర్మిల బస్సు యాత్ర చేపట్టారు. ఉద్యోగులు తమ జీవితాలను, జీతాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని హోరెత్తిస్తుండటంపై షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. సమైక్యాంధ్ర పోరులో కదంతొక్కుతోన్న ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె హామీపై ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా బుధవారం జిల్లాలో హిందూపురం, కదిరి, అనంతపురంలో పర్యటించిన  షర్మిలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కదిరి, హిందూపురం, అనంతపురం సభలకు భారీ ఎత్తున జనం కదలి వచ్చి షర్మిలకు మద్దతు పలికారు.
 
 అన్ని వర్గాల ప్రజల్లోనూ వైఎస్సార్‌సీపీ మాత్రమే రాష్ట్రాన్ని ఐక్యంగా నిలపగలదనే విశ్వాసం నెలకొంది. రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. తెలుగుజాతి అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ నడుంబిగించడం వల్లే ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధిష్టానంలో కీలకపాత్ర పోషించే ఓ మాజీ ప్రజాప్రతినిధి ఒకరు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోండటం గమనార్హం. ‘సమైక్యాంధ్ర ఉద్యమంలో మేం ఏ మొహం పెట్టుకుని పాల్గొనాలి.
 
 ఇప్పటికీ మా అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదిలిపెట్టడం లేదు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే నిర్ణయం తీసుకుని.. ఇప్పుడు యాత్రలు చేస్తే జనం విశ్వసిస్తారా?’ అంటూ ఆ నేత బాహాటంగా విమర్శలు చేస్తోండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని జేసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. జిల్లాలోని ఓ సీనియర్ మంత్రి కూడా తన అంతరంగికుల మధ్య ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 14 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశమే లేదని సీనియర్ మంత్రి తన అంతరంగికుల వద్ద కుండబద్ధలు కొడుతుండటం కొసమెరుపు.
 

మరిన్ని వార్తలు