రోడ్డు ప్రమాదంలో న్యూస్ ప్రెజంటర్ బద్రి మృతి

9 Feb, 2015 01:50 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో న్యూస్ ప్రెజంటర్ బద్రి మృతి
  • పశ్చిమగోదావరి జిల్లాలో దుర్ఘటన
  •  చిన్న కుమారుడు మృతి
  •  చికిత్స పొందుతున్న ఆయన భార్య, పెద్దకుమారుడు, బావమరిది
  • సాక్షి, నెట్‌వర్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ9 చానల్ న్యూస్ ప్రెజంటర్ కాళ్ల వీరభద్రయ్య అలియాస్ బద్రి (39), ఆయన చిన్న కుమారుడు మృతిచెందారు. ఈ దుర్ఘటన ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ లక్ష్మీనగర్ వద్ద రాష్ట్ర రహదారిపై జరిగింది. కుటుంబంతో కలసి బద్రి ఆదివారం తెల్లవారుజామున ద్వారకాతిరుమలలోని శ్రీవారి సన్నిధిలో ఉన్న మాధవ కల్యాణ మంటపంలో జరిగిన ఆయన బాబాయి కుమారుని వివాహానికి హాజరయ్యారు.

    అనంతరం చినవెంకన్నను దర్శించుకున్న బద్రి.. తన అత్తవారి ఊరు నల్లజర్ల మండలంలోని ఆవుపాడుకు బయల్దేరారు. మార్గ మధ్యంలో వారు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముందు టైరు పంక్చరు కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మర్రి చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న బద్రి అక్కడికక్కడే మరణించగా, ఆయన చిన్న కుమారుడు సాయి సాత్విక్(8) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

    ఈ ప్రమాదంలో ఆయన భార్య లక్ష్మీసుజాత, పెద్ద కుమారుడు సాయి సందీప్, బావమరిది గంట్రోతు తారక్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి సందీప్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. తారక్ పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. పోస్టుమార్టం అనంతరం బద్రి మృతదేహాన్ని విజయవాడ సూర్యారావుపేటలోని ఆయన తండ్రి నివాసానికి తరలించారు. తొలుత బద్రి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ సీ చానల్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేశారు. అనంతరం సిబార్ చానల్‌లో కొంతకాలం పనిచేసి, 2004లో టీవీ9లో చేరి అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు.
     
    చంద్రబాబు, జగన్ సంతాపం: బద్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బద్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బద్రి మృతి పట్ల పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విచారం వ్యక్తం చేశారు. బద్రి మృతి పట్ల తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్ర సంతాపం తెలియజేసింది.

మరిన్ని వార్తలు