పదవుల్ని వదలండి ఎన్‌జీఓల డిమాండ్

27 Sep, 2013 03:04 IST|Sakshi
సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సాధ్యం కాదని ఏపీ ఎన్‌జీఓలు స్పష్టం చేస్తున్నారు. పదవులు పట్టుకుని వేలాడుతూ, సోనియా పంచన తిరుగుతుండడంపై ప్రజలు ఏవగించుకుంటున్నారని ఎలుగెత్తుతున్నారు. ‘ఇకనైనా పదవుల్ని పరిత్యజించి, ఉద్యమ బాట పట్టండి’ అని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నారు.
 
 సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్య ఉద్యమం 58వ రోజైన గురువారం కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా సాగింది. అమలాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ కుర్చీలు నెత్తిన పెట్టుకుని ‘సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులారా! కుర్చీలు వదలండి! రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి సమైక్యతను కాపాడండి’ అని నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద మంత్రుల మాస్క్‌లతో సమైక్యవాదులు ప్రదర్శన చేశారు. మంత్రుల మనసు మారాలంటూ పాస్టర్లు రోడ్డుపై ప్రార్థనలు చేశారు. దేవదూతల వేషాల్లోని చిన్నారులు మంత్రులకు జ్ఞానోదయం కలిగించినట్టు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సామర్లకోటలో మంత్రి తోట నరసింహంను సమైక్యవాదులు అడ్డగించి రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. కోరుకొండలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను సమైక్యవాదులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నడో రాజీనామా చేశానని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్న పెందుర్తి జేఏసీ దీక్షలో పాల్గొని వెళ్లిపోయారు.  ఏపీఎన్‌జీఓల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండవ రోజైన గురువారం కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అడ్డుకున్నారు. దీంతో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల నుంచి హైదరాబాద్, విశాఖ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు తిరగలేదు. ధవళేశ్వరంలో ప్రైవేట్ బస్సులను నిలిపివేసిన సమైక్యవాదులు వాటిలో ప్రయాణిస్తున్న తెలంగాణ విద్యార్థులను గుర్తించి వారితో సమైక్య నినాదాలు చేయించారు. సీమాంధ్ర వాసుల సామరస్యాన్ని, రాష్ట్రం విడిపోతే వచ్చే అనర్థాలను వారికి వివరించారు.
 
 రాజమండ్రిలో ‘బాలఘోష’
 సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన పురోహితుడు వేలూరి వెంకట కామేశ్వరశర్మ ధవళేశ్వరంలో తూర్పు డెల్టా ప్రధాన కాలువలో జలదీక్ష చేశారు. రాజమండ్రిలో ఫ్యూచర్స్ కిడ్స్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు ఏవీ ఆప్పారావు రోడ్డు నుంచి జాతీయ రహదారిపై స్కేటింగ్ చేస్తూ జేఎన్ రోడ్డు వరకూ ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన తమ భవిష్యత్తును కాలరాస్తుందంటూ చిన్నారులు రాజమండ్రిలో పశు సంవర్ధకశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ‘బాలఘోష’ కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ జిల్లా చైర్మన్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల పిల్లలు సహాయ సంచాలకుల కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీమాంధ్ర జిల్లాలకు చెందిన మున్సిపల్ ఇంజనీర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ ఎన్‌జీఓ హోమ్ వద్ద సమావేశమైన ఎన్‌జీఓలు తమ రాష్ట్ర ఆధ్యక్షుడికి తెలంగాణ వాదుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలని కోరుతూ మండల ఫ్లవర్ డెకరేటర్‌‌స ఆధ్వర్యంలో కడియం కెనాల్ రోడ్డులో ఇద్దరు పూల వ్యాపారులను ఇరు ప్రాంతాలకు చెందిన వధూవరులుగా అలంకరించి వివాహం చేశారు.
 
 కాకినాడలో బజ్టీలు వేసి ఉపాధ్యాయుడి నిరసన
 కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల దీక్షా శిబిరం వద్ద వెంకటరావు అనే ఉపాధ్యాయుడు బజ్జీలు వేసి నిరసన తెలి పారు. మరో ఉపాధ్యాయుడు పరసా సత్యనారాయణ తొలి బజ్జీని రూ.530కు కొనుగోలు చేశారు. బజ్జీల అమ్మకం ద్వారా వచ్చిన రూ.2200ను ఉపాధ్యాయ జేఏసీ శిబిరానికి విరాళంగా ఇచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు హృదయాకార గుర్తులు ధరించి దీక్షల్లో పాల్గొన్నారు. దస్తావేజు లేఖరులు పొట్టి శ్రీరాములు వేషధారణతో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. జిల్లా పరిషత్ సెంటర్‌లో న్యాయశాఖ మహిళా ఉద్యోగులు గాజులు, కుంకుమ పంచి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ శవయాత్ర సాగించి కాకినాడ కలెక్టరేట్ వద్ద దహనం చేశారు.  
 
 కరాటే క్రీడాకారుల విన్యాసాలు
 అమలాపురంలో డివిజన్ పరిధిలో గురుకుల పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. గడియార స్తంభం సెంటర్‌లో కొనసాగుతున్న నిరవధిక దీక్షల్లో సాంఘిక, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనగా, శిబిరం వద్ద జాతీయ గీతాలాపనతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంబంధిత శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావుతో పాటు జేఏసీ ప్రతినిధులు నక్కా చిట్టిబాబు, ఇతర ఉద్యోగులు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేశారు. అమలాపురం పవర్‌కిక్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మంది క్రీడాకారులు గడియారస్తంభం సెంటర్‌లో విన్యాసాలు చేశారు. మందపల్లి శనైశ్చరాలయంలో దేవస్థానం చైర్మన్ సిద్దంశెట్టి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర సమైక్యతను కాపాడాలంటూ హోమం చేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై చేనేత కార్మికులు రోడ్డుపై నేత నేసి, నూలు వడికి నిరసన తెలిపారు.
 
 విడిపోతే డెల్టాలు ఎడారే..
 మామిడికుదురులో కోనసీమ రైతు జేఏసీ కన్వీనర్ యాళ్ల వెంకటానందం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా గోదావరి డెల్టాలు ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 30న ఎదురులంక నుంచి చించినాడ వరకూ భారీ మోటారు సైకిల్ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై వ్యాయామ ఉపాధ్యాయులు కర్రలతో వ్యాయామ విన్యాసాలు చేసి నిరసన తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ దీక్షకు మద్దతుగా సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
 
 రాజోలులో దారపురెడ్డి బాబ్జీ చేపట్టిన రిలే దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. రాజోలులో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పూ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మలికిపురంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. సఖినేటిపల్లిలో పొలిటికల్ జేఏసీ రిలే దీక్షలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు చేపట్టింది. పిఠాపురం ఆర్‌ఆర్ బీహెచ్‌ఆర్ కళాశాల విద్యార్థులు కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. జాతీయ దళిత ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో వంటా వార్పూ చేపట్టారు.
 
 సామర్లకోట జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను నిలిపి, విద్యార్థులను, ఉపాధ్యాయులను దీక్షా శిబిరం వద్దకు తరలించి సమైక్య నినాదాలు చేయించారు. పెద్దాపురం జేఏసీ దీక్షల్లో ఆ పట్టణానికి చెందిన ఓఎన్‌జీసీ ఉద్యోగి శేఖర్ భార్య, తెలంగాణ లోని సంగారెడ్డికి చెందిన రాణి సుజాత పాల్గొని సమైక్యరాష్ట్రానికి మద్దతు పలికారు. తునిలో నియోజకవర్గంలోని ఐదు మండలాల వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అధికారులు మోటారుసైకిల్ ర్యాలీ చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. వాహనాలను తుడుస్తూ నిరసన తెలిపారు.
 జాతీయ రహదారిపై ముస్లింల వంటావార్పు
 సమైక్యాంధ్రకు మద్దతుగా రాజానగరంలో జాతీయ రహదారిపై ముస్లింలు వంటా వార్పూ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించారు. రామచంద్రపురంలో జేఏసీ నేతలు భిక్షాటన చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు మండలంలోని గ్రామాలకు వెళ్లి రైతులను చైతన్యం చేశారు. న్యాయవాదుల జేఏసీ, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీల దీక్షలు కొనసాగుతున్నాయి. కె.గంగవరం మండలం ఎర్రపోతవరంలో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది.
 
 కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల పోరు నిద్ర
  సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు గురువారం రాత్రి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై  పోరు నిద్ర చేపట్టారు. రిలే నిరాహారదీక్ష ముగించాక ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, తోటకూర సాయిరామకృష్ణ, సుబ్బరాజు, పెద్దిరాజు, కృష్ణమూర్తి తదితరుల నాయకత్వంలో సుమారు 50 మంది ఉపాధ్యాయులు రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు.  
 
మరిన్ని వార్తలు