సిట్‌ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..

18 Jan, 2019 18:51 IST|Sakshi

విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్‌ సహాయ నిరాకరణపై ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్‌ సహకరించడం లేదని ఎన్‌ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్‌ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్‌ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్‌ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది.

వారం రోజుల ఎన్‌ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు