విచారణ ముమ్మరం 

20 Jan, 2019 10:03 IST|Sakshi
హత్యాయత్నంలో గాయపడ్డ వైఎస్‌ జగన్‌(ఫైల్‌), హత్యకు వినియోగించిన కత్తి

అది 2018 అక్టోబర్‌ 25. నయవంచక పాలనపై సమరభేరి మోగిస్తూ... ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అశేష జనవాహిని నడుమ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువలో సాగుతోంది. ఆ రోజు మొదటిపూట యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు అధినేత చేరుకున్నారు. ఇంతలో ఓ దుండగుడు ఆయన్ను హతమార్చేందుకు కత్తితో దాడిచేశాడు. అనుకోని సంఘటనతో ఆయన చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. దానికి సంబంధించిన కేసు 
నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నిస్తుంటే... ఎన్‌ఐఏ మాత్రం కేసు మూలాల దర్యాప్తులో తలమునకలై ఉంది.

సాక్షిప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన్ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలన్నదే ప్రత్యర్థుల వ్యూహం. అందుకు వేదికయ్యింది విశాఖ ఎయిర్‌పోర్టు. రెస్టారెంట్‌లో పనిచేసే ఓ యువకుడిని అందుకు పావుగా వాడుకున్నారు. వాడిచేత హతమార్చాలని యత్నించారు. కానీ ఆ కుట్ర ఫలించలేదు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని కృపవల్ల అంత పెద్ద గండం నుంచి జగన్‌ బయటపడగలిగారు.

అంతటి నాయకుడిపై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. చకచకా కేసు విచారణ సాగిస్తోంది. దానిలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను శనివారం విశాఖ పిలిపించి విచారించింది. వారిలో జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. వీరిద్దరూ ఎన్‌ఐఏకు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...
రాష్ట్రంలో సాగుతున్న నయవంచక పాలనపై సమరభేరి మోగిస్తూ... ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు విపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 294వ రోజైన గతేడాది అక్టోబర్‌ 25న సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో కొనసాగింది. చప్పబుచ్చమ్మపేట క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌ పాయకపాడు మీదుగా మక్కువ మండల కేంద్రం శివారు వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుని  ముగించారు.

అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్టీ జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. జగన్‌తో సెల్ఫీ దిగే నెపంతో దగ్గరకు వచ్చిన శ్రీనివాసరావు అనే దుండగుడు కోడి పందాలకు వాడే పదునైనకత్తితో జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో జగన్‌ భుజానికి తీవ్ర గాయమైంది. ఈ సమయంలో అక్కడే ఉన్న మజ్జి శ్రీనివాసరావు, మరికొందరు పార్టీ నేతలు కలిసి నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని మాత్రం స్థానిక పోలీసులకు ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టు భద్రతా విభాగం అధికారులకు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మొదటినుంచీ అనుమానాలు
ప్రతిపక్షనేతపై హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్ర భుత్వం, డీజీపీ స్పందించిన తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక్కడి పోలీసుల దర్యాప్తుపై నమ్మకం కోల్పోయిన వీరు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ అధికారులకు మజ్జి శ్రీను, రాజన్నదొర ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. అనంతర పరిణామాల్లో కేసు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) చేతికి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ దర్యాప్తు చేస్తుండటంతో మరలా పార్టీ ఆదేశాలను అనుసరించి వీరు ఎన్‌ఐఎకు సహరించేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు ఎన్‌ఐఏ కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా వీరికి నోటీసులు జారీచేయడంతో విశాఖ వెళ్లి అక్కడి ఎన్‌ఐఏ అధికారుల బృందానికి పూర్తిగా వాంగ్మూలం ఇచ్చారు. ఎన్‌ఐఏ ఎప్పుడు పిలిచినా విచారణకు రావడానికి తాము సిద్ధమని, తమ నాయకుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎంతటి పెద్దవాళ్లున్నా వారికి చట్టప్రకారం శిక్షపడేలా ఎన్‌ఐఏ చేస్తుందనే నమ్మకం తమకుందని తెలిపారు.

సామాన్యుల పరిస్థితేంటి
ఎవరిపై హత్యాయత్నం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. కానీ ఓ పార్టీకి అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వమే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటోందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎన్‌ఐఏను నియమించింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి న్యాయ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేయడం, ఎన్‌ఐఏకు సహకరించకపోవడం చూస్తుంటే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎన్‌ఐఏ ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు.

కుట్రదారులంతా బయటికొస్తారు
ఆ రోజు ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రతి విషయాన్నీ ఎన్‌ఐఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారు మా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎన్‌ఐఏ విచారణను అడ్డుకోమని, విచారణే వద్దని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేస్తే న్యాయస్థానం వారికి అనుకూలంగా స్పందించకుండా వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటన వెనుక ఉన్న రాష్ట్ర పెద్దలు, కుట్ర దారులంతా ఎన్‌ఐఏ విచారణ ద్వారా బయటకు రావడం తథ్యం. – మజ్జి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, విజయనగరం

మరిన్ని వార్తలు