అప్రమత్తం

26 Oct, 2014 02:42 IST|Sakshi
అప్రమత్తం
  • ఉగ్రవాద కార్యకలాపాలపైఎన్‌ఐఏ హెచ్చరికతో పోలీసుల అలెర్ట్
  •  తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా నిఘాను పటిష్ఠం చేసిన ఉన్నతాధికారులు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి:  ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ) హెచ్చరికలతో తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలు గోపీనాథ్ జట్టి, జి.శ్రీనివాస్ నిఘాను పటిష్ఠం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతితో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో తనిఖీలను శనివారం కూడా కొనసాగించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికపై నిఘా వేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

    తెలంగాణలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎస్‌బీఐ, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లూటీల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ గుర్తించింది. ఆ బ్యాంకుల్లో లూటీ చేసిన సొమ్మును తిరుపతి, చెన్నైల్లో కొన్ని సంస్థలకు చేరవేసి, ఆస్తులను కూడగట్టి స్థావరాలను ఏర్పాటుచేసుకునేందుకు ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందంటూ ఎన్‌ఐఏ శుక్రవారం రాత్రి తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలకు సమాచారం అందించింది.

    శుక్రవారం రాత్రే తిరుపతికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం విస్తృతంగా సోదాలు చేసిన విషయం విదితమే. శుక్రవారం రాత్రి తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా సోదాలు చేసిన పోలీసులు శనివారం కూడా తనిఖీలను కొనసాగించారు. ప్రధాన రహదారుల్లో నాకాబందీ నిర్వహించి.. వాహనాలను తనిఖీ చేశారు. లాడ్జిల్లో సోదాలు చేశారు. గుర్తింపు కార్డులు లేకుండా లాడ్జిల్లో ఎవరికీ వసతి కల్పించవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఉగ్రవాద సంస్థ నుంచి జిల్లాలో ఏ ఏ ప్రాంతాలకు నిధులు చేరవేశాయన్న అంశంపై ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. ప్రధాన బ్యాంకుల అధికారులతో రహస్యంగా మంతనాలు జరిపింది.
     
    తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల, ఆస్తుల క్రయవిక్రయాలపై ఆరా తీసింది. అనుమానాస్పద క్రయవిక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్‌ఐఏ బృందం ఓ వైపు సోదాలు, దర్యాప్తు చేస్తుంటే.. మరో వైపు పోలీసులూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ప్రకటించిన హై అలెర్ట్‌ను శనివారం కూడా కొనసాగించడం గమనార్హం.
     

మరిన్ని వార్తలు