దళారుల దయ..పాస్‌పోర్టు నీదయా!

26 Jun, 2014 00:22 IST|Sakshi
దళారుల దయ..పాస్‌పోర్టు నీదయా!
  •     బహిరంగంగా దళారుల దందా
  •      స్లాట్‌ల మంజూరులో కీలక పాత్ర
  •      వినియోగదారుల జేబులకు చిల్లు
  • విశాఖపట్నం : పాస్‌పోర్టు సేవ లో దళారులు రాజ్యమేలుతున్నారు. నేరుగా జరగని పనిని దళారులు చిటికెలో చేసేసి దరఖాస్తుదారులను ఆశ్చర్యపరుస్తున్నారు. దరఖాస్తుదారుల అవసరాన్ని బట్టి దళారులు డబ్బు గుంజుతున్నారు. పాస్‌పోర్టు కోసం ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ సామాన్యులకు అర్థం కాక దళారులను ఆశ్రయిస్తున్నారు.

    ఇదే అదనుగా భావిస్తున్న దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారులను దోచుకుంటూ  హవా కొనసాగిస్తున్నారు. వీరి మాయమాటలు నమ్ముతున్న ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. స్లాట్ బుకింగ్, దరఖాస్తు,నోటరీఅంటూదళారులు వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, గుర్తింపు, చిరునామాలు అప్పటికప్పుడు సృష్టించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. వేగంగా పాస్‌పోర్ట్ మంజూరు కోసం అడ్డదారుల్లో ప్రయత్నించి సఫలీకృతులు కావడం గమనార్హం.

    దళారుల జోక్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రానికి అతి సమీపంలో దళారులు వ్యాపారాలు నిర్వహించినా అధికారులు చూసీ చూడనట్టు ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రానికి ఆనుకుని దళారుల కార్యాలయాలు ఉండటం సందేహాలకు తావిస్తోంది. కేంద్రానికి అతి సమీపంలో దళారుల కార్యాలయాల బోర్డులు అమర్చడంతో ప్రజలు విస్తుబోతున్నా రు.

    పాస్‌పోర్టు మంజూరు కోసం చట్టబద్ధమైన ఫీజులకు దళారులు మంగళం పాడేశారు. దళారుల కార్యాలయాలు బిర్లా కూడలిలో ఇష్టానుసారంగా వెలిశాయి. జిరాక్స్ కేంద్రాలుగా వెలిసి పాస్‌పోర్టు బుకింగ్‌లకు అడ్డాలుగా అవతరిస్తున్నాయి. మరికొందరు తాత్కాలిక టెంట్‌లు వేసి ఆకర్షిస్తున్నారు.  ప్రజలు నేరుగా వెళ్తే పనులు జరగడం లేదని చెబుతున్నారు.

    అవసరమైన పత్రాలు తీసుకువెళితే ఇది నిజమేనా! ఒరిజినల్ తీసుకువచ్చావా! అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అంటున్నారు. పోలీస్, నోటరీ సర్టిఫికెట్లకు  వేలాది రూపాయలు ముట్టజెప్పాలని వాపోతున్నారు. ఇటీవల జరుగుతున్న మేళాలతో దళారులకు కాసుల పంట పండుతోందని కొందరంటున్నారు. మేళాలో పాస్‌పోర్ట్ స్లాట్ కోసం దళారులు ముందస్తు అడ్వాన్సులు తీసుకోవడం కొసమెరుపు.
     

మరిన్ని వార్తలు