నిధుల్లేవు.. అభివృద్ధి లేదు

29 Sep, 2014 03:01 IST|Sakshi
నిధుల్లేవు.. అభివృద్ధి లేదు

చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న ధ్వజం
 
 సాక్షి, నెల్లూరు :‘పైసా నిధుల్లేవు. అభివృద్ధి పనుల్లేవు. కల్లబొల్లి మాటలతో చంద్రబాబు ప్రభుత్వం కాలం నెట్టుకొస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదన్నారు. స్మార్ట్‌సిటీలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కోస్తా కారిడార్‌లు అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు మాటల గారడీతో కనికట్టు చేస్తున్నారని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భేషరతుగా రుణమాఫీ, డ్వాక్ర రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ గొప్పలు పోయిన చంద్రబాబు అధికారం చేతికొచ్చాక రైతులు, డ్వాక్రా మహిళలను వంచించాడన్నారు. ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను పీకి పారేసి నడివీధుల్లోకి నెడుతున్నారని ప్రసన్న విమర్శించారు. ఇప్పటికే గృహ నిర్మాణశాఖ, ఆదర్శ రైతులు, ఉపాధ్యాయులతోపాటు పలు విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగులందరినీ వీధిపాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన బాబు వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. చివరకు విద్యార్థులకు ఎంసెట్‌లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మళ్లీ పంట కాలం వచ్చినా రైతులు బ్యాంకుల వద్దకు రుణానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో పంటల బీమా వర్తించే పరిస్థితి లేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదని, ధాన్యానికి పుట్టి రూ.14 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రసన్న డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ ఏ ఆసరాలేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు కల్పిస్తే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటిలో దారుణంగా కోతలు విధిస్తోందని ప్రసన్న విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పదన్నారు.  ఇప్పటికైనా బాబు మనసు మార్చుకొని ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని హితవు పలికారు.
 3న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
 అక్టోబర్ మూడో తేదీన స్థానికి మాంగుట లేఅవుట్ లోని వెంకటేశ్వర దేవస్థానం వెనుకన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు  నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు.  మూడో తేదీ ఉదయం 11:45 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ పరిశీలకులు, కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.



 

మరిన్ని వార్తలు