టీవీ..సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా

7 Jun, 2019 12:37 IST|Sakshi
జి.మాధురీరెడ్డిని అభినందిస్తున్న కుటుంబీకులు, బంధువులు

రోజుకు 10 నుంచి 12 గంటలు చదివాను

అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెలకట్టలేనిది

పక్కా ప్రణాళికతో చదవడంతోనే ఆల్‌ ఇండియాలో 7వ ర్యాంక్‌ వచ్చింది

‘సాక్షి’తో ‘నీట్‌’ టాపర్‌ మాధురీ రెడ్డి

కర్నూలు  :కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తానని ఆల్‌ ఇండియా ర్యాంకర్‌ మాధురీరెడ్డి తెలిపారు. గత నెల 5న నిర్వహించిన నీట్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన మాధురీరెడ్డి ఆల్‌ ఇండియా లెవల్‌లో 7వ ర్యాంకు సాధించారు. గురువారం కర్నూలుకు వచ్చిన మాధురీరెడ్డికి బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.

ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం?
జ: మాది శిరివెళ్ల మండలం గోవిందపల్లె. నాన్న జి.తిరుపతిరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అమ్మ జి.పద్మావతి గృహిణి. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు.

ప్రశ్న: పాఠశాల, కాలేజీ విద్య ఎక్కడ పూర్తి చేశారు?
జ: హైదరాబాదులోని క్రిక్‌ స్కూల్‌లో 1 నుంచి 7వ తరగతి వరకు, మాదాపూర్‌లోని నారాయణ స్కూల్‌లో 8 నుంచి 10 వరకు చదివాను. ఇంటర్మీడియెట్‌ కూడా మదాపూర్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీలో చదివి 982 మార్కులు సాధించాను.  

ప్రశ్న:నీట్‌ కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
జ: ఇంటర్మీడియెట్‌తో పాటు నీట్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ప్రతి రోజు 10 నుంచి 12 గంటలు చదువుకే కేటాయించాను. నీట్‌ కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకొని అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించుకొని చదివాను. ప్రతి రోజు తరగతి గదిలో క్లాస్‌లో నోట్‌ తయారు చేసుకొని ఏవైనా డౌట్స్‌ వస్తే వెంటనే సంబంధిత సబ్జెక్టు లెక్చరర్‌ను అడిగి క్లారీఫై చేసుకునేదాన్ని. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపై తక్కువ సమయంలో పట్టు సాధించగలిగాను.

ప్రశ్న: నీట్‌లో ఆల్‌ ఇండియా స్థాయిలో 7వ ర్యాంకు వస్తుందని అనుకున్నారా?
జ: ముందుగానే టాప్‌ టెన్‌ లక్ష్యంగా పెట్టుకొనే ప్రిపేర్‌ అయ్యాను. ఇందు కోసం టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌కు దూరంగా ఉండి చదివాను. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. నీట్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.

ప్రశ్న: నీట్‌కు ప్రిపరేషన్‌లో పేరెంట్స్‌ సహకారం ఎలా ఉండేది?
జ: అమ్మ, నాన్న చదువులో ఎంతో ప్రోత్సాహించే వారు. లెక్చరర్ల సహకారం కూడా మరువలేనిది.  ఎప్పుడైనా టైడ్‌ అనిపిస్తే బ్యాడ్మింటన్‌ ఆడి రిలాక్స్‌ అయ్యేదాన్ని.

ప్రశ్న:మెడిసిన్‌ పూర్తయ్యాక మీ లక్ష్యం?
జ: మెడిసిన్‌ పూర్తయ్యాక కార్డియాలజీ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తా.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా