అక్రమాల నిగ్గు తేల్చేందుకు సన్నద్ధం!

19 Jul, 2015 00:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్షేత్రస్థాయిలో మొక్కలు ఉన్నాయో లేవో చూడకుండా ఇష్టారీతిన ఒకేసారి పెద్దమొత్తంలో  చెల్లింపులు,  పూర్తి స్థాయిలో పనులు జరగకుండానే చెరువు గ ట్టు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు, పని దినాలకు మించి మస్తర్లు వేసి పెద్ద ఎత్తున వేతనాలు డ్రా చేయడం వంటి పరిణామాలు తెర్లాం మండలంలో బయటపడ్డాయి.  అంతా కుమ్మక్కయ్యే ఇదంతా చేశారన్న అభిప్రాయానికి అధికార వర్గాలొచ్చాయి. ఈ ఒక్క మండలంలోనే రూ.50 లక్షల మేరకు అవినీతి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనికంతటికీ మండల స్థాయిలో  పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని  భావిస్తున్నారు. అందుకనే తెర్లాం వ్యవహారంలో ఎంపీడీఓను సైతం బాధ్యుడ్ని చేస్తున్నారు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంపీడీఓలకు నోటీసులివ్వడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నతాధికారులున్నారు.   తెర్లాం వ్యవహారంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా విచారణతో పాటు నివేదిక తయారవుతోంది. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని   జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, పరిశీలన చేయాలని   డ్వామా వర్గాలు భావిస్తున్నాయి.
 
 ఈమేరకు ప్రత్యేక బృందాల్ని నియమిస్తున్నాయి. అనుమానం వచ్చిన చోట ముందుగా తనిఖీలు చేయనున్నారు, ఆ తరువాత  మిగతా చోట్ల దశల వారీగా పరిశీలన చేయాలని యోచిస్తున్నారు. పరిశీలనకు సంబంధించి ఒక నమూనా తయారు చేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారులిచ్చిన నమూనా ప్రకారం క్షేత్రస్థాయి అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఇంకోవైపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా తనిఖీలు చేయనుంది. తెర్లాం తరహా భాగోతం ఎక్కడెక్కడ జరిగిందో నిగ్గు తేల్చేందుకు సిద్ధమవుతున్నాయి. కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కూడా సీరియస్‌గా ఉన్నారు. ఆరోపణలొచ్చినా, అభియోగాలు నిర్ధారణైనా వెంటనే చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. కొంతమందిని ఏరిపారిస్తే తప్ప అక్రమార్కులు అదుపులోకి రారని భావిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు