గోల్‌మాల్‌ కిష్టప్ప

7 Dec, 2018 11:56 IST|Sakshi
ఎంపీ నిమ్మల కిష్టప్ప ,వాసుదేవరావు

సీపీఓ వాసుదేవరావుపై కక్ష

బలవంతంగా సెలవులోకి పంపిన ఎంపీ

చేయని పనులకు నిధులివ్వకపోవడమే కారణం

విధుల్లో ఉండగానే పోస్టు ఖాళీగా చూపిన వైనం

డీడీకి ఎఫ్‌ఏసీ ఉత్తర్వులు

ఎంపీ నిధుల గోల్‌మాల్‌ను అడ్డుకోవడంతో వేధింపులు

వాస్తవాలు పరిశీలించకనే ఉన్నతాధికారుల చర్యలు

చేయని పనులకు నిధులు విడుదల చేయలేదని ఓ అధికారిపై ఎంపీ నిమ్మల కిష్టప్ప కన్నెర్ర చేశారు. నిబంధనలకు లోబడి పనిచేసినందుకు జిల్లా ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారులు తమదైన శైలిలో సన్మానించారు. నిజానిజాలతో పనిలేకుండా ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. బదిలీ చేయకుండా, సెలవులో వెళ్లకుండా, ఓ అధికారి కుర్చీలో ఉండగానే మరో అధికారికి బాధ్యతలు అప్పగించి పరిపాలననుఅపహాస్యం చేశారు. తన మాట వినలేదని.. చెప్పినట్లు, చెప్పినచోట సంతకాలు చేయలేదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప.. సీపీఓ వాసుదేవరావును బలి చేశారు.     ఈ ఉదంతం సీపీఓ కార్యాలయంతో పాటు జిల్లా యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ఖర్చు చేయడంలో సీపీఓ పాత్ర కీలకం. ఎస్‌డీఎఫ్, ఎస్‌డీపీ, ఎంపీ ల్యాడ్స్‌ నిధులకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు, నిధుల మంజూరు సీపీఓ పర్యవేక్షిస్తారు. ఈ బాధ్యతను వాసుదేవరావు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం ఆయన తన బాధ్యతలను డీడీ కాశీవిశ్వేశ్వరరావుకు అప్పగించారు. సీపీఓను డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అధికారులు బదిలీ చేయలేదు.. తప్పు చేశారని సస్పెండ్‌ చేయలేదు.. పోనీ సీపీఓ సెలవులోనూ వెళ్లలేదు.. ఆయన కుర్చీలో ఉండగానే డీడీకి ఎఫ్‌ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు) ఇవ్వడం గమనార్హం.

అవినీతికి సహకరించని ఫలితం
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఏడాదికి రూ.5కోట్ల చొప్పున రూ.25కోట్లు ఎంపీ నిధులు వస్తాయి. ఇందులో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ కోటా, ఆ తర్వాత జనరల్‌ కోటాగా నిధులు ఖర్చు చేయాలి. కిష్టప్ప సొంత మండలం గోరంట్లలో రవి ట్యాంక్‌(చెరువు)కు సంబంధించి రూ.1.15కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధుల్లో రూ.25 లక్షలు కిష్టప్ప కోటాలో, మరో రూ.25లక్షలు ఎంపీ సీఎం రమేశ్‌ కోటాలో, తక్కిన రూ.65లక్షలు ఉపాధిహామీ నిధులు ప్రతిపాదించారు. ఎంపీ నుంచి ప్రతిపాదనలు రాగానే సీపీఓ ఎస్టిమేషన్‌(అంచనా రిపోర్ట్‌)కు పంపారు. సంబంధిత ఏఈ, డీఈలు అంచనాలు రూపొందించి ఈఈ ద్వారాఎస్‌ఈకి పంపాలి. ఎస్‌ఈ తిరిగి ఫీజుబిలిటీ కోసం డ్వామా పీడీకి రిపోర్ట్‌ పంపిస్తారు. డ్వామా పీడీ అంగీకరించిన తర్వాత తిరిగి సీపీఓకు వస్తుంది. దీనికి సమయం పడుతుంది. కానీ ప్రతిపాదనలు పంపిన రెండు రోజులకే నిధులు మంజూరు చేయాలని సీపీఓపై కిష్టప్ప ఒత్తిడి తెచ్చారు. నిజానికి ఈ చెరువు పనిలో పూడిక తీతకు ప్రతిపాదనలు పెట్టారు. ఈ పనులు కేవలం ‘నీరు–చెట్టు’ ద్వారానే చేయాలి. ఎంపీ ల్యాడ్స్‌ ఖర్చు చేయకూడదు. రిపోర్ట్‌ ఎస్‌ఈ వద్ద ఆగింది. డ్వామా పీడీకి వెళ్లలేదు. దీంతో డ్వామా పీడీకి చెప్పండి రిపోర్ట్‌ నాకు పంపాలని, లేదంటే నిధులు ఇవ్వండని మీరు లెటర్‌ ఇవ్వండి, మంజూరు చేస్తాం అని సీపీఓ కిష్టప్పను అడిగితే లెటర్‌ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో సీపీఓపై ప్లానింగ్‌ సెక్రటరీ, డైరెక్టర్‌కు కిష్టప్ప ఫిర్యాదు చేశారు. సీపీఓకు ప్రజాప్రతినిధులు, అధికారులకు సరైన కమ్యూనికేషన్‌ లేదని, బదిలీ చేయండని కలెక్టర్‌ కూడా ప్రతిపాదించారు. ఆ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాశారు. సీపీఓ విధుల పట్ల ఎక్కడ సంతృప్తి చెందలేదో ఆధారాలతో పంపాలని అందులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్‌ ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు.

నిబంధనల విరుద్ధంగా మరో పని చేయాలని నిమ్మల ఒత్తిడి
మొత్తం రూ.25కోట్ల నిధుల్లో రూ.23.5కోట్ల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. తక్కిన రూ.1.5కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తర్వాత పంపిస్తామని కిష్టప్ప సీపీఓపై ఒత్తిడి తెచ్చారు. పనులు చేయకుండా, వేటికి ఎంత ఖర్చు చేశారో లేకుండా ఎలా నిధులు విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు 2014–15లో ఎంపీ నిధులకు సంబంధించి కిష్టప్ప చేసిన ప్రతిపాదనల్లో కొన్ని పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ఈ నిధులు అప్పటి సీపీఓ విడుదల చేయలేదు. ఆ నిధులు కూడా విడుదల చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే పనులు జరుగుతున్నట్లు ఈఈ నుంచి లెటర్‌ ఇప్పించండని ఎంపీని కోరారు. దీనికీ కిష్టప్ప ఒప్పుకోలేదు. 2015 వరకూ ఎంపీ ల్యాడ్స్‌ ఫైళ్లు డ్వామా పీడీ పర్యవేక్షించారు. 2015 నుంచి సీపీఓ పర్యవేక్షణలోకి వచ్చాయి. వాసుదేవరావు కంటే ముందు 2015లో ఒకరు, 2016–17లో ఇద్దరు సీపీఓలుగా పనిచేశారు. వారెవ్వరూ ఈ నిధులు విడుదల చేయలేదు. చేయని పనులు కాబట్టి వాసుదేవరావు కూడా ససేమిరా అన్నారు. వీటితో పాటు మరో 113 పనులకు రూ.1.64కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఎంపీ నిధులు ఎస్సీ, ఎస్టీ కోటా పూర్తి చేసిన తర్వాతే జనరల్‌ కోటా భర్తీ చేయాలి. 113 పనుల్లో 16 పనులు ఎస్సీ, ఎస్టీ కోటా కింద.. తక్కిన 97 జనరల్‌ కోటాలో ఉన్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ కోటా పనులు పూర్తి చేయండని ఎంపీకి  సీపీఓ తెలిపారు. దీనికి కిష్టప్ప ససేమిరా అన్నారు. ఇలా చేయని పనులు చేసినట్లు యూసీ(యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌)లు ఇవ్వండని ఒత్తిడి తెచ్చారు. ఈ తప్పుడు రికార్డులపై సంతకాలు చేస్తే సీపీఓనే బాధ్యత వహించాలి. సీపీఓ సంతకం చేసేదాకా కలెక్టర్‌ సంతకం చేయని పరిస్థితి. దీంతో సీపీఓను సెలవులో వెళ్లమని కిష్టప్ప హుకుం జారీ చేశారు. దీనికి సీపీఓ వినలేదు. ఈక్రమంలో కిష్టప్ప తిరిగి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు ఉన్నతాధికారులు వాసుదేవరావును పద్ధతి లేకుండా పక్కనపెట్టేశారు.

వాసుదేవరావును తప్పించేలాజీవోలపై జీవోలు
అనంతపురం సీపీఓగా డీడీ కాశీవిశ్వేశ్వరరావుకు ఎఫ్‌ఏసీ ఇస్తూ ఉత్తర్వులు పంపారు. దీంతో సీపీఓ పోస్టును ఖాళీగా చూపించారు. నిజానికి సీపీఓగా వాసుదేవరావు ఉన్నారు. ఆ రోజు నుంచి సీపీఓ రోజూ విధుల్లోకి వస్తున్నారు. ఇది తెలిసి సీపీఓ ఈ–ఆఫీసును నిలిపేశారు. దీంతో ఆయన పనులకు ఆటంకం ఏర్పడింది. తిరిగి ఈ నెల 3న మరో ఉత్తర్వు పంపారు. ఇందులో సీపీఓలో సెలవులో ఉన్నారని, అందుకు డీడీకి ఎఫ్‌ఏసీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ సీపీఓ విధుల్లోనే ఉన్నారు. అదేరోజు సర్క్యులర్‌ను కార్యాలయంలోని అందరికీ ఇచ్చి సంతకాలు పెట్టించి డైరెక్టరేట్‌కు పంపారు. దీంతో గురువారం వాసుదేవరావు డీడీకి బాధ్యతలు అప్పగించి వచ్చేశారు. చేయని పనులకు బిల్లులు చేయమన్న ఫలితానికి ఓ అధికారిపై టీడీపీ ఎంపీ కక్షగట్టి, అతన్ని వేధించిన తీరు ఇది. ఉన్నతాధికారులు కూడా వాస్తవాలతో పనిలేకుండా అధికారిపై వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సెలవులో వెళ్లమని చెప్పారు. రేపు ఎంపీ రాజీనామా చేయమంటే చేయలా? అని అంతా ప్రశ్నిస్తున్నారు.

తప్పు చేస్తే సస్పెండ్‌ చేయండి
నేను తప్పు చేయకపోయినా లీవ్‌లో వెళ్లమన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ఈ క్రమంలో నేను బలవంతంగా లీవ్‌లో వెళితే నాకు జీతం రాదు. తప్పు చేస్తే బదిలీ చేయండి. లేదంటే సస్పెండ్‌ చేయండి. అంతే కానీ ఇలా చేయడం బాధించింది. నేను ఉండి, ఎఫ్‌ఏసీ ఇచ్చిన డీడీ ఉంటే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. నా వల్ల ప్రభుత్వ విధులకు ఆటంకం ఏర్పడకూడదని నేను బాధ్యతలు అప్పగించి వచ్చేశా.
– వాసుదేవరావు, సీపీఓ

మరిన్ని వార్తలు