ఎంపీ తనయులకు బెయిల్‌, ఆందోళన

25 Apr, 2017 14:23 IST|Sakshi
ఎంపీ తనయులకు బెయిల్‌, ఆందోళన

అనంతపురం: బాగేపల్లి టోల్‌ప్లాజాపై దాడి కేసులో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులను బెయిల్ పై విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాగేపల్లి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్‌లను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మాపై దాడి చేస్తే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడిచిపెడతారా అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త ఫర్నీచర్‌ కొనిస్తామని ఎంపీ నిమ్మల కిష్టమ్మ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.

అంబరీష్, శిరీష్‌ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్‌గేట్‌ వద్ద అంబరీష్‌ అనుచరుల కారును ఆపి గేట్‌ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగలగొట్టారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని బాధితులను బెదిరించారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు