చంద్రగిరిలో ‘ఎన్‌ఐఎన్’

20 Feb, 2015 05:55 IST|Sakshi

 రూ.3 కోట్లతో ఏర్పాటుకు ఐసీఎంఆర్ అంగీకారం
 సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-ఎన్‌ఐఎన్)ను ఏర్పాటు చేసేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ముందుకొచ్చింది. చంద్రగిరిలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) భవనాన్ని తాత్కాలికంగా ఎన్‌ఐఎన్‌కు కేటాయిస్తున్నారు. ఎన్‌ఐఎన్ సహకారంతో ఏర్పాటయ్యే ఈ సంస్థను ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ (మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్)గా పిలుస్తారు.
 
 దీనికోసం ఐసీఎంఆర్ రూ.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రమిస్తున్న వ్యాధులు వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, కొత్తగా వచ్చే వైరస్‌లు తదితర అన్నింటిపైనా ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఇది తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండి ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. దీంతో పాటు రూ.200 కోట్లతో జాతీయ స్థాయి ఎన్‌ఐఎన్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇది కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు