నిండుకుండలా జలాశయాలు

1 Sep, 2014 01:02 IST|Sakshi
నిండుకుండలా జలాశయాలు

చోడవరం : నాలుగురోజులుగా కురుస్తున్న తుపాను వర్షాలతో జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. గత 15 రోజులతో పోల్చిచూసుకుంటే ఇన్‌ఫ్లో బాగా పెరిగి రిజర్వాయర్లన్నింటిలో నీటిమట్టాలు భారీగా పెరిగాయి. ఎగువ ప్రాంతాల్లో వరదనీరు భారీగా రావడంతో పెద్దేరు, కోనాం, రైవాడ, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఒకేసారి పెరిగాయి.

ఈ రిజర్వాయర్ల కింద సుమారు 80 వేల ఎకరాల వరి సాగు జరగాల్సి ఉండగా ఇప్పుడు నాట్లు జోరుగా వేస్తున్నారు. కోనాం జలాశయం నుంచి దిగువ ఎగువ కాలువలకు 100 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పెద్దేరు గేట్లు ఎత్తి పెద్దేరు నదిలోకి అదనపు నీరు రెండువేల క్యూసెక్కులను వదులుతున్నారు.

రైవాడ జలాశయం నుంచి  100 క్యూసెక్యుల నీరు విడుదల చేస్తున్నారు. శారదానదిలోకి 50 క్యూసెక్కుల నీరు కుడికాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. కల్యాణపులోవ నుంచి 40 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పెద్దేరు రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో నీటి మట్టం  ప్రమాద స్థాయికి చేరుకుంది. మరోపక్క వర్షాలు, రిజర్వాయర్ల నీరు రావడంతో పల్లం, మెట్ట ప్రాంతాల్లో దమ్ములు పట్టి వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు.

ఈ మూడ్రోజుల్లో సుమారు 20 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఎక్కడ చూసినా నాట్లువేసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. అయితే ఒకేసారి అందరూ నాట్లు వేయడంతో కూలీల కొరత ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు