ఘొల్లుమన్న జి.వెంకటాపురం

23 Oct, 2018 07:45 IST|Sakshi
వంట్లమామిడి వద్ద బోల్తాపడి నుజ్జయిన ఆటో

విశాఖపట్నం, మాకవరపాలెం : ఒకే గ్రామంలో ఏడుగురు మరణించడం ఆ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలను టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో జీ వెంకటాపురం గ్రామం గొల్లుమంది. సోమవారం కాకినాడలో గృహ ప్రవేశ కార్యక్రమానికి టాటా మేజిక్‌ ఆటోలో వెళ్లి వస్తుండగా చేబ్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీ వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు జీ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్‌(34), కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన నాగరాజు(42) మృతి చెందడం ఈ రెండు గ్రామాల ప్రజలను కలచివేసింది.

కూలి పనులే ఆధారం..
జీ.వెంకటాపురం గ్రామం సమీపంలో నిర్మించిన అన్‌రాక్‌ రిఫనరీ కోసం ఇక్కడి భూములు సేకరించారు.  మృతులంతా ఈ భూ సేకరణలో భూములు కోల్పోయిన వారే. దీంతో పదేళ్లుగా వీరంతా కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సబ్బవరపు నూకరత్నం భర్త అప్పనాయుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

తల్లులకు దూరమైన పిల్లలు...
ప్రమాదంలో ఒకే గ్రామంలో ఏడుగురు మహిళలు మృతి చెందడంతో వారి పిల్లలు తల్లులకు దూరమయ్యారు. వరహాలమ్మకు ఒక కూతురు, కొడుకు ఉండగా కుమార్తెకు వివాహం చేసింది. ఇక మహాలక్ష్మి భర్త మరణించాడు. ఉన్న ఒక కూతురుకి వివాహం చేసినా ఆమెను భర్త వదిలేయడంతో మహాలక్ష్మి కూలి పనులు చేస్తూ కూతురు, మనుమరాలిని పోషిస్తోంది. పైల లక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. అచ్చియ్యమ్మ ఒక కూతురికి వివాహం చేసింది. కొడుకు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. గవిరెడ్డి రాముకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు వికలాంగురాలు, రాము వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈమె వద్దే ఉంటున్నారు. ఇక వీరి బాగోగులు చూసుకునే వారెవరంటూ స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పైడితల్లికి కూతురికి వివాహం చేయగా, కొడుకు చదువుకుంటున్నాడు.

వారికి దిక్కెవరో...
ఆటో డ్రైవర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఈ చిన్నారులకు దిక్కెవరోనని స్థానికులు కన్నీటిపర్వంతమయ్యారు. నూకరత్నంకు కూడా ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. వీరు చదువుకుంటున్నారు. వీరు కూడా తల్లిలేని పిల్లలయ్యారు. దీంతో గ్రామస్థులంతా మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విలపించారు. తల్లులను కోల్పోయిన పిల్లలను ఓదార్చారు. మృతదేహాలు ఎప్పుడు గ్రామానికి చేరుకుంటాయోనని ఎదరుచూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు