చంద్రబాబువి శుష్కవాగ్దానాలే

10 Feb, 2014 01:41 IST|Sakshi
 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల కాలంలో పేద ప్రజలను, రైతులను పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా ఎవ్వరూ పట్టించుకోరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏలూరులో ఆదివారం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన వాగ్ధానాలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారని ఆరోపించారు. కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఉచిత విద్యుత్ ఇమ్మని, రుణమాఫీ చేయమని కోరినా పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. వైఎస్ మాదిరిగా పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసిన నేత ఎవ్వరయినా ఉన్నారా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పాపం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలదేనని ఆయన విమర్శించారు.
 
 వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప్పెనలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోతాయన్నారు. ఏలూరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి మ్యానిఫెస్టో రూపకల్పన చేస్తామని తో చంద్రశేఖర్ చెప్పారు. వైఎస్ హయంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన పోలవరం, ఎత్తిపోతల, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను సత్వరం పూర్తి చేయడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు.  వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని, ఆరోగ్య శ్రీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, వికలాంగ పింఛన్లు రూ. 500 నుంచి 1,000 వరకూ పెంచుతామన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించి సమైక్య రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికలకు కార్యకర్తలు  సిద్ధం కావాలని కోరారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. బూత్ కమిటీ కార్యకర్తలు కష్టించి పనిచేయాలని అన్నారు. 
 
మరిన్ని వార్తలు