ఢిల్లీ కోటలో నరసాపురం కోడలు!

29 May, 2014 01:20 IST|Sakshi
ఢిల్లీ కోటలో నరసాపురం కోడలు!
జాతీయ టెలివిజన్ చానెళ్లలో తనదైన శైలిలో చర్చలు, ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, రాజకీయ దిగ్గజాలతో పోటీపడి పార్టీ వాణిని మీడియా వేదికపై బలంగా వినిపించి.. అందరినీ మెప్పించిన నిర్మలా సీతారామన్ గత కొద్దికాలంగా బీజేపీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఏనాడూ ప్రజాప్రతినిధిగా పని చేయకపోయినా, ఈసారి ఎన్నికల్లో పోటి చేయకపోయినా కూడా ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.  గత గుజరాత్ ఎన్నికల్లో ప్రచారకర్తగా, వ్యూహకర్తగా నిర్మలా సీతారామన్ పనితీరు మోడీని ఆకట్టుకుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి మోడీ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే మీడియాతో కూడా సత్సంబంధాలు ఏర్పరుచుకుని, జాతీయ మీడియాలో మోడీ పేరు మార్మోగిపోయేలా చేయడంలో తెరవెనుక ఈమె పోషించిన పాత్ర చాలా ఉంది. సరిగ్గా ఇదే అంశం మోడీనే కాకుండా బీజేపీ అగ్రనేతలను కూడా ఆకట్టుకునేలా చేసింది. 
 
పార్టీ అంకిత భావంతో సేవలందించి, బీజేపీలో అగ్రస్థాయికి చేరడం నిర్మలా సీతారామన్ కు సానుకూలంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన ఆమె పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోడలు.  తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన నిర్మలా సీతారామన్ డాక్టర్ పరకాల ప్రభాకర్ సతీమణి. పరకాల ప్రభాకర్ త్రండి శేషావతారం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతనే కాకుండా మంత్రిగా సేవలందించారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన నిర్మలా సీతారామన్ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో పనిచేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నిర్మలా సీతారామన్ చేసిన సేవలు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానికి చేరువయ్యేలా చేశాయి. అద్వానీ, ఇతర బీజేపీ నేతలతో పరిచయాలు ఆమెను బీజేపీలో చేరేందుకు కారణమైంది. భర్త కాంగ్రెస్, బీజేపీ, పీఆర్పీ.. ఇలా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. తాను మాత్రం బీజేపీనే అంటిపెట్టుకుని ఉండటం, దానికితోడు ఆమె చురుకుదనం, అంకిత భావం కారణంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్థాయికి చేరుకున్నారు. ఇటీవలి కాలంలో పంజాబీ లాబీ కారణంగా నిర్మల పేరు కాస్త వెనకబడినట్లు అనిపించినా.. అప్పటికే మోడీ దృష్టిలో ఉండటంతో నేరుగా స్వతంత్ర హోదాలో సహాయమంత్రి పదవి, అది కూడా అత్యంత కీలకమైన వాణిజ్యం, పరిశ్రమల శాఖ దక్కింది.
 
వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ముందు పెద్ద సవాళ్లే నిలిచి ఉన్నాయి. బంగారం దిగుమతులపై నియంత్రణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై మ్యాట్ విధింపు, ఉత్పాదక రంగంలో గణనీయంగా పడిపోయిన ఉత్పత్తి, కార్మిక చట్టాలు, భూసేకరణలో సమస్యలు ... ఇలా అనేకానేక సమస్యలు ఆమె ముందు కొలువుదీరాయి. వివిధ రంగాల్లో సేవలందించిన నిర్మలా సీతారామన్ తన ముందు ఉన్న సవాళ్లను ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. 
మరిన్ని వార్తలు