బాబాయే... కాలయముడు

17 Sep, 2014 02:52 IST|Sakshi
బాబాయే... కాలయముడు

ఖమ్మం క్రైం/ గూడూరు : వరుసకు బాబాయి అయిన వ్యక్తే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. ముక్కు పచ్చలారని బాలుడిని అతి కిరాతకంగా మెడకు బెల్టు బిగించి చనిపోయేంతవరకు అదిమిపట్టి..కొట్టి దారుణంగా హత్య చేశాడు. గూడూరు మండలం గంటలమ్మపాలెంకు చెందిన చండిక కిషోర్‌కుమార్, కోమలాదేవి దంపతులు హైదరాబాద్‌లోని చింతల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కోమలాదేవి చెల్లెలు దేవిసాయి ఖమ్మంలో నివసిస్తోంది. ఆమెకు  15వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉండటంతో  పరిచర్యల కోసం కోమలాదేవి తన నాలుగేళ్ల కుమారుడు నిషాంత్‌తో కలిసి ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్లింది. అయితే నిషాంత్ సాయివర్మ(4) అలియాస్ వడ్డీ ఈనెల 11న కిడ్నాప్‌నకు, అదే రోజు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ మృతదేహం   14వ తేదీన నగర శివార్లలో లభించింది.
 
నగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలతో బాలుడి బాబాయే హత్య చేశాడని ఎస్పీ  ఏవీ.రంగనాథ్ మంగళవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిషాంత్ తల్లి కోమలాదేవి ఆస్పత్రిలో ఉన్న తన చెల్లి దేవిసాయిని పలకరించేందుకు బాలుడిని తీసుకుని ఖమ్మం వచ్చింది. అయితే అప్పటికే దేవిసాయికి, ఆమె భర్త మధుకు మధ్య కుటుంబ పరంగా తగాదాలున్నాయి. తన భార్య తనతో సఖ్యతగా ఉండడం లేదని.. దీనికి ఆమె అక్కే కారణమని భావించాడు. భార్యపై ఉన్న కోపంతో నిషాంత్‌సాయివర్మను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఉన్న మధు.. తన కారులో ఆస్పత్రి నుంచి అతని తల్లికి తెలియకుండా బయటకు తీసుకెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపం నుంచి బాలపేట బైపాస్ రోడ్డు పొదల్లోకి తీసుకెళ్లాడు.  
 
బాలుడిని కారులోనే బెల్టుతో మెడకు బిగించి గట్టిగా లాగడంతో పాటు బాగా కొట్టి గొంతు నులిమాడు. దీంతో బాలుడు చనిపోయాడు. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి వెళ్లిన మధు.. ఆ తర్వాత తన మీదకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో అతని మిత్రుడు కిషోర్, బాలాజీ అనే డ్రైవర్ సహకారంతో బాలుడి మృతదేహాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి పాతిపెట్టాలని ప్రయత్నించాడు. ఇందుకోసం వారికి రూ.1.50 లక్షలు ముట్ట జెప్పాడు. బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 14న బాలపేట ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం బయట పడింది.
 
ఈ సందర్భంగా వారం రోజుల్లో ఈ కేసును చేధిస్తామని చెప్పిన పోలీసులకు అస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా, వైరా రోడ్డులో ఉన్న మరో సీసీ కెమెరా  నిందితుడిని పట్టించాయి. మధు.. నిషాంత్‌ను కారులో తీసుకెళ్తుండగా ఆస్పత్రి సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో పాటు వైరా రోడ్డులోని కెమెరాలో అతని కారు వెళ్తుండడం నిక్షిప్తమైంది. దీని ఆధారంగా పోలీసులు అతన్ని విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.  ఈ కేసులో ప్రధాన నిందితుడైన మధుతో పాటు అతని మిత్రుడు కిషోర్‌ను అరెస్టు చేశామని,  మరో నిందితుడు డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఖమ్మం డీఎస్పీ బాలకిషన్, టూటౌన్ సీఐ సారంగపాణి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

>
మరిన్ని వార్తలు