సొంతగూటికి చేరనున్న ‘నిట్టు’ !

22 Dec, 2013 06:52 IST|Sakshi

కామారెడ్డి, న్యూస్‌లైన్ : టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న నిట్టు వేణుగోపాల్‌రావు త్వరలో సొంతగూటికి చేరనున్నారు. రాజకీయ ఎదుగుదలకు కారణమైన బీజేపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకుని ఆ పార్టీ నేతలతో సంప్రదించినట్లు సమాచారం. పార్టీలో చేరికకు పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలిసింది. తెలంగాణ విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించలేని పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీకి స్థానం లభించే పరిస్థితులు కానరాకపోవడం తో ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్న బీజేపీలో చేరడమే మంచిదన్న భావనతో ఆయన ఆ పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిలర్‌గా మూడు పర్యాయాలు పనిచేసిన నిట్టు వేణుగోపాల్‌రావుకు పట్టణంతో పాటు నియోజక వర్గంలో బలమైన క్యాడర్ ఉంది. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ పిలుపు మేరకు నిట్టు వేణుగోపాల్‌రావు తన అనుచరులతో 2008లో టీడీపీలో చే రారు. సాధారణ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత 2011 లో వచ్చిన ఉప ఎన్నికల్లో నిట్టు వేణుగోపాల్‌రావు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
 
 ఓటమి చెందిన తరువాత ఆయన నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జిగా  క్రియాశీలకంగానే పనిచేశారు. తెలంగాణ విషయంలో టీడీపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వేణుగోపాల్‌రావు ఇక లాభం లేదనుకుని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ కూడా ఉండడం, తాను అదే పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరడమే ఉత్తమమని భావించి బీజేపీలో చేరడానికి సన్నద్ధ మైనట్టు తెలుస్తోంది.
 
 టీడీపీకి మరో దెబ్బ
 టీడీపీకి నిట్టు గుడ్‌బై చెబితే నియోజక వర్గంలో ఆ పార్టీకి మరో దెబ్బతగిలినట్టేనని భావిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నియోజక వర్గంలో ఆ పార్టీ ఎంతో బలంగా ఉండేది. నాలుగు పర్యాయాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మున్సిపల్‌తో పాటు మండలాల్లోనూ ఆ పార్టీ బలం ఎంతో ఉండేది. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీని వీడిన తరువాత నియోజక వర్గంలో ఆ పార్టీకి భారీ దెబ్బతగిలింది. ఇప్పుడు నిట్టువేణుగోపాల్‌రావు నిష్ర్కమిస్తే మరో దెబ్బతగిలి కోలుకోకపోవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు