సత్తా చాటండి.. సాయం పొందండి

21 Sep, 2018 11:11 IST|Sakshi
రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు

ఎన్‌ఎంఎంఎస్‌ ద్వారా ఏటా రూ.12 వేలు ఉపకార వేతనం

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న ఉపాధ్యాయులు

దరఖాస్తులకు ఈనెల 24వ తేదీ వరకు గడువు

అనంతపురం, రాప్తాడు: కొందరు విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నా రు. అటువంటి వారిని ప్రోత్సాహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌( ఎన్‌ఎం ఎంఎస్‌) పేరిట ఉపకార వేతనం అం దిస్తోంది. ఇందుకుగానూ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. గత ఏడాది వరకు రూ.6 వేల చొప్పున ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి రూ.12 వేలకు పెంచారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వరకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు దీన్ని వినియోగించుకోవాలని ఉపా«ధ్యాయులు సూచిస్తున్నారు.

ఎంపిక ఇలా...
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్‌ మొదటివారంలో పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ప్రతిభ కనబరిచిన వారిని ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. ఎనిమిదో తరగతి చదువుతున్న వారు పరీక్ష రాసేందుకు అర్హులు. దీనిలో అర్హత సాధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.12వేలు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకే ఇస్తారు. కాగా ఒక్కసారి స్కాలర్‌షిప్‌ మొత్తం రెట్టింపు చేయడంతో అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాప్తాడు, హంపాపురం, మరూరు, ఎం.బండమీదపల్లి, కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది ఏపీ మోడల్‌ స్కూల్లో ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. రాప్తాడు, హంపాపురం, మరూరు పాఠశాలల నుంచీ ఎంపికయ్యారు.

పరీక్షా విధానం
ప్రతిభ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు మండల పరిషత్, జిల్లా పరిషత్, గురుకుల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధిం చాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ అర్హత పరీక్ష 180 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్, అర్థమెటిక్, గణితం, సైన్స్, సోషల్, అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జనరల్, బీసీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు