అక్రమార్కులపై చర్యలేవి?

14 Nov, 2013 03:41 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : సర్పంచుల చెక్ పవర్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు.. అక్రమాలకు పాల్పడిన మాజీ సర్పంచులపై కనీస చర్యలు కూడా తీసుకోవడానికి సాహసించడం లేదు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పంచాయతీ నిధులను కాజేసిన వారినుంచి సొమ్ము కక్కించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
 
 1984 నుంచి..
పంచాయతీలకు కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. గతంలో జేఆర్‌వై కింద నిధులిచ్చిన సర్కారు ఇప్పుడు బీఆర్‌జీఎఫ్, ఈజీఎస్ పథకాల కింద నిధులిస్తోంది. దీనికి తోడు వివిధ పన్నుల రూపంలో గ్రామంనుంచి కొంత ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు, మురికికాల్వలు, కల్వర్టు లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం నిర్వహణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇలా అభివృద్ధి పనుల నిమిత్తం వచ్చిన నిధులను కొందరు సర్పంచ్‌లు నొక్కేశారు. అడిగే నాథుడే లేకపోవడంతో అసలు పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో పేర్కొని నిధులు దిగమింగారు. నామమాత్రంగా పనులు చేసి లక్షల రూపాయల్లో బిల్లులు కాజేశారు. పారిశుధ్యం, విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శించారు. కొన్ని చోట్ల గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారు.
 
 1984 నుంచి ఇప్పటివరకు సర్పంచులుగా పనిచేసినవారిలో 167 మంది రూ. 1.28 కోట్ల మేర నిధులను కాజేశారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ వీరివద్ద రికవరీ చేసిన సొమ్ము నామమాత్రమే. కేవలం ముగ్గురు సర్పంచ్‌లనుంచి రూ. 2.09 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇంకా 164 మంది నుంచి నిధులు రికవరీ చేయాల్సి ఉంది.
 
 చెరువుల నిధులూ కాజేశారు
 చెరువుల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద లక్షల రూపాయలు మంజూరు చేసింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చిన నిధుల వినియోగంలో కొందరు సర్పంచులు చేతివాటం ప్రదర్శించారు. సిమెంట్, ఇసుక, కంకర వంటి సామగ్రి నిధులను మింగేశారు. సామాజిక తనిఖీలలో ఈ అక్రమాలు వె లుగులోకి వచ్చినా చర్యలు శూన్యం. అక్రమాలకు పాల్పడిన సర్పంచుల నుంచి నిధులను రికవరీ చేసి ఇవ్వాలని ఈజీఎస్ అధికారులు పంచాయతీరాజ్ అధికారులకు నివేదిక పంపినా ఫలితం లేకుండా పోయింది.
 
 నోటీసులతోనే సరి
 అక్రమాలకు పాల్పడిన సర్పంచులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. అయితే తహశీల్దార్లు అక్రమార్కులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. మింగేసిన నిధులను చెల్లించని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు