అప్రమత్తత ఏదీ...!

5 Aug, 2013 04:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ..ఆ పేరెత్తగానే చరిత్ర కారుల మనసు పులకిస్తుంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నాలుగు జిల్లాల భౌగోళిక స్వరూపం గుర్తుకొస్తుంది. అలనాటి రతనాలసీమను సీట్లు, ఓట్ల  రాజకీయాల కారణంగా చీల్చేందుకు కుట్రలు ముమ్మరమయ్యాయి. ఇందులో రెండు జిల్లాలకు మహర్దశ కల్పిస్తామంటూ ఏఐసీసీ పెద్దలు కుయుక్తులు పన్నుతున్నారు.  ఇందుకు అనంతపురం, కర్నూలు  జిల్లాలకు చెందిన కొందరు నాయకులు చాపకింద నీరులా చర్యలు ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో అప్రమత్తతతో ఈప్రాంతం కోసం ఉద్యమించాల్సిన నాయకులలో ఉద్యమస్పూర్తి కొరవడింది. వ్యక్తిగత  ప్రచారాల  కోసం ప్రాధాన్యతనిస్తూ చిత్తశుద్ధిలేని ఉద్యమాలకు తెరలేపుతున్నారు.
 
 కేంద్ర ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి చిదంబరం 2009 డి సెంబర్9న చేసిన ప్రకటన ఏర్పాటు వాదులకు బలాన్ని చేకూర్చింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రజానీకం పెద్ద ఎత్తున ప్రతిఘటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతం శ్రీకృష్ణ కమిషన్ తుదినివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆమేరకు నిర్ణయం తీసుకోవాల్సిన పాలకులు దానిని విస్మరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవిభజన ఉద్యమాన్ని గుర్తించామని ఓట్లు, సీట్ల  కోణంలో విభజించేందుకు సిద్ధమయ్యారు. ఈపరిణామాన్ని సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వెనుకబడిన ప్రాంతాలను  అభివృద్ధి చేశాకే విభజన డిమాండ్‌ను ఆలోచించాలని ఉద్యమిస్తున్నారు.
 
 తప్పుదారి పట్టించేందుకే
 హైలెవెల్ కమిటీ ప్రకటన...
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు  ఐదు రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆయా ప్రాంతాల ఉద్యమ సెగ ఢిల్లీ పెద్దలకు తాకింది. దీంతో  హైలెవెల్ కమిటీని  ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైలెవెల్ కమిటీలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించడం వెనుక ‘రాయలతెలంగాణే’ అసలు లక్ష్యంగా కన్పిస్తోందని వారు భావిస్తున్నారు. ఇందుకు అనంతపురం, కర్నూలు  జిల్లాలకు చెందిన కొందరు నాయకులు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
 
 ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగా రాయల తెలంగాణాకు మద్దతు ప్రకటించారు. వీరికి కొనసాగింపుగా అనంతపురం జిల్లాకు చెందిన ఓసీనియర్ మంత్రి అక్కడి తెలుగుదేశం ఎమ్మెల్యేల మద్దతు కూడగ డుతున్నట్లు సమాచారం. ఆ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో మంతనాలు నిర్వహించి కర్నూలు  టీడీపీ నాయకులను ఒప్పించే బాధ్యతలను ఉంచినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందని ఓమంత్రి సైతం అదేబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు జిల్లాల నాయకులు చాపకింద నీరులా రాయల తెలంగాణకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
 
 కొరవడిన ఉద్యమస్పూర్తి....
 ప్రజలలో  సమైక్యాంధ్ర  తపన ఉన్నా జిల్లాలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులలో ఉద్యమస్పూర్తి కొరవడిందని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, వీరశివారెడ్డి పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి సైతం అదేబాట పట్టారు. అలాగే రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కూడా రాజీనామా చేశారు. వీరిలో ఒక్క ఆదినారాయణరెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలు ఎవరూ ప్రత్యక్షంగా ఉద్యమం బాటలో లేరనే చెప్పాలి.
 
 ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యక్షపోరాటం చేయాల్సిన నాయకులు దూరంగా ఉండిపోతున్నారు. ఎమ్మెల్సీ బత్యాల నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు.  అదే స్పూర్తిని తెలుగుదేశం నాయకులు వంటబట్టించుకున్నారు.  పదవికి రాజీనామా చేయాలంటూ  ఎమ్మెల్యే లింగారెడ్డి  కాళ్లు పట్టుకుని ప్రొద్దుటూరు జేఏసీ అభ్యర్థించింది. అయినప్పటికీ ఆయనలో స్పందన లోపించిందనే చెప్పాలి. ఎంపీ రమేష్, ఎమ్మెల్యే లింగారెడ్డి రాజీ‘డ్రామా’లో భాగంగా హైదరాబాద్‌లో రాజీనామాలు సమర్పించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి విభజన ఉద్యమానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు.
 
 లోపిస్తున్న చిత్తశుద్ధి..
 సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకులకు చిత్తశుద్ధి లేదనే  చెప్పాలి. ప్రాంతానికి, ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉద్యమాన్ని మలచాల్సిన నాయకలు వ్యక్తిగత ప్రచారం  కోసం ప్రాధాన్యత  ఇస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఎవరి స్థాయిలో వారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.  ఐక్యంగా ఒకేతాటిపై ఉద్యమాన్ని చేపట్టడంలో విఫలమవుతున్నారనే భావన  బలపడుతోంది.

మరిన్ని వార్తలు