మళ్లీ అడుగంటిన రక్త నిల్వలు

24 Jan, 2015 11:19 IST|Sakshi

 జిల్లాకు పెద్ద దిక్కు రిమ్స్ ఆసుపత్రి. రోగం ముదిరినా ... రోడ్డు ప్రమాదం జరిగినా ప్రాణం కాపాడుకోవడానికి ఎంతో ఆశతో  వస్తారు ... కానీ ఇక్కడే రిక్తహస్తం ఎదురైతే... అదే జరుగుతోంది... నిధులు లేక ఆధునిక వైద్య పరికరాలు లేకపోతే సర్లే అనుకోవచ్చు ... వైద్య నిపుణుల నియామకం లేకపోతే ఉన్నవాళ్లతో  ఏదోలా వైద్యం చేయించుకోవచ్చు ... కానీ ఉండాల్సిన రక్త నిల్వలే కొరవడితే ఎవరిదీ పాపం? సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే పరిస్థితి తలెత్తితే తొలుత సమస్య తీవ్రతను ‘సాక్షి’ గుర్తించింది. ఈ సమస్యను వార్తగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకుంది. వరుస కథనాలతో ఇటు అధికార యంత్రాంగాన్ని, అటు స్వచ్ఛంద సంస్థలను, కళాశాల ప్రతినిధులను కదిలించింది. సమస్య తీవ్రతను తెలుసుకున్నవాళ్లంతా తలో చేయి వేశారు. రక్తదాన శిబిరాలతో తమ దాతృత్వాన్ని చూపించారు. జిల్లా కలెక్టర్ విజయకుమార్, అప్పటి డీఎంహెచ్‌ఓ, ఇతర అధికారులు నడుం బిగించి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆగిపోతున్న శ్వాసకు బాసటగా నిలిచారు. ఆ సంతోషం పట్టుమని ఆరునెలలు కూడా మిగలలేదు. సజావుగా సాగుతుందనుకున్న బ్లడ్ బ్యాంకులకు మళ్లీ రక్త హీనత ఏర్పడింది. మిణుకు, మిణుకుమంటూ కొట్టుమిట్టాడుతున్న పెద్దప్రాణానికి చేతులొడ్డాల్సిన తరుణం ఆసన్నమయింది.
 ఒంగోలు సెంట్రల్ : రిమ్స్ రక్త నిధిలో ప్రతి రోజూ 50 యూనిట్లకు తక్కువకాకుండా రక్తం నిల్వ ఉండాలి. కానీ 30 యూనిట్ల రక్తం ఉండడడం గనమవుతోంది. అధికారుల నిర్లక్ష్య ఫలితమే దీనికి కారణం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండటంతోపాటు జెడ్పీ సీఈఓ ఇన్‌చార్జిగా ఉన్నారు. స్టెప్ అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్‌కే వచ్చిన రక్తం తరలిస్తుండడంతో అక్కడి బ్లడ్‌బ్యాంక్‌లో నిల్వలు మాత్రం ప్రజల అవసరాలకు సరిపోతున్నాయి. అంటే 35 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటోంది. కానీ రిమ్స్ రక్తనిధి మాత్రం నిండుకుంది. ఇలా తగ్గుతున్న సమయంలోనే సంబంధిత రిమ్స్ అధికారులు గుర్తించి పరిస్థితి తీవ్రతను కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దాలి. నిర్లక్ష్యం ఆవహించడంతో చేతులు కాలుతున్నా చర్యలు మాత్రం లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడుతోంది. గత నెలలో రెండు క్యాంపులు నిర్వహించినా కేవలం 44 యూనిట్ల రక్తం మాత్రమే సమకూరింది. అన్ని పరీక్షలు చేసి 40 యూనిట్లు అందుబాటులోకి తెచ్చారు.  
 ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు
 రిమ్స్‌లో ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఇన్ పేషంట్లుగా ఉన్న కొన్ని రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీటికితోడు రెండు సిజేరియన్ కాన్పులు, మరో నాలుగు సహజ కాన్పులు జరుగుతుంటాయి.  జిల్లాలో జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ఇతరత్రా రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో నిలవాల్సిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతోంది.
 ‘ప్రయివేటు’వైపు వైపు పరుగులు  
 ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరా చేసుకొని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు దోపిడీకి తెరదీస్తున్నాయి. రోగి అవసరాన్ని బట్టి వారి బంధువుల వద్ద నగరంలోని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు నిర్ణీత ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు రూ.3 వేలు, అవసరమైన గ్రూపు రక్తం కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా రక్తం ప్యాకెట్ కోసం వస్తే అదే పరిణామంలో రక్తం ఇస్తే డబ్బులు చెల్లించనవసరం లేదు. దీన్నే రిప్లేస్‌మెంట్ అంటారు. కానీ కొన్ని ప్రయివేటు బ్లడ్‌బ్యాంకులు మాత్రం రీ ప్లేస్‌మెంట్‌కు ససేమిరా అంటున్నాయి. డబ్బులు చేతిలో పడితేనే బ్యాగ్ ఇస్తామనడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించి చైతన్యం రగిలించాల్సిన రక్త నిధి కేంద్రాల్లో పని చేస్తున్న మోటివేటర్స్ ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు.
 కొరత వాస్తవమే, అందరూ స్పందించాలి.
 డాక్టర్ అదిలక్ష్మి ఎం.డి రిమ్స్, బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి
 రక్తం తక్కువ ఉన్న మాట నిజమే. రీ ప్లేస్ మెంట్ విధానం ద్వారానే రక్తాన్ని సేకరిస్తున్నాం. ఉద్యోగులు, విధ్యార్దులు స్పందించి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినవారవుతారు.
 రక్తదానంతో మరింత ఆరోగ్యం

రక్తదానం చేస్తే బలహీనమైపోతామనే భయం చాలా మందిలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు 18-60 సంవత్సరాల వయస్సులోపుండీ 45 కేజీలకుపైగా బరవున్న వారరందరూ రక్తం ఇవ్వవచ్చు. సంవత్సరానికి మూడుసార్లు ఇస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్య నిపుణులు.

మరిన్ని వార్తలు