కరెన్సీ కటకట

12 Feb, 2018 11:18 IST|Sakshi

బ్యాంకుల్లో నిండుకుంటున్న నగదు..

ఏటీఎంల ఎదుట నో క్యాష్‌ బోర్డులు  

నగదుకోసం జనం ఇబ్బందులు

ధర్మవరానికి చెందిన ఓబిరెడ్డి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పెట్రోల్‌ అయిపోయింది. పెట్రోలు బంకులో స్వైపింగ్‌ మిషన్‌ పనిచేయలేదు. డబ్బులు తీసుకుందామని ఏటీఎంకు వెళితే నగదు లేదని మూసివేశారు. నాలుగైదు ఏటీఎంలు తిరిగినా అదే కథ. చివరికి తన స్నేహితునికి ఫోన్‌ చేసిన రూ.500 అప్పు ఇప్పించుకుని పెట్రోల్‌ పోయించుకున్నాడు. నగదు చేతిలో లేక ఏటీఎంలలో రాక జిల్లాలోని జనం పడుతున్న ఇబ్బందులకు ఓబిరెడ్డి ఉదంతమే నిదర్శనం.  

జిల్లాలోని ప్రధాన బ్యాంకులు 36
456 అన్ని బ్యాంకుల శాఖలు
రూ.కోట్లలో 50–70 రోజూ విత్‌డ్రా అవుతున్న మొత్తం

ధర్మవరం: జిల్లాలో ఎవరి నోట విన్నా.. కరెన్సీ కష్టాలే. ఖాతాలో డబ్బులున్నా.. చిల్లిగవ్వ చేతికందక జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు తగ్గిపోవడం... విత్‌డ్రాలు పెరిగిపోవడంతో అన్ని బ్యాంకుల్లో నగదు నిండుకుంటోంది.. ఇక నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు లావాదేవీల రుసుముమలకు భయపడి జనం రహిత లావాదేవీలను అంగీకరించడం లేదు. దీంతో జిల్లాలోని ఏ ఏటీఎం ముందు చూసినా నోక్యాష్‌ బోర్డులు కనిపిస్తోంది. అరా కొరా ఉన్నా.. జనం బారులు తీరికనిపిస్తున్నారు. ఇక రెండు, మూడు రోజులు సెలవు వచ్చిందంటే...పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది.  

జమకాని నగదు: జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా అవుతోందే తప్ప డిపాజిట్‌(జమ) కావడం లేదు. బయటికి చెప్పకపోయినప్పడికీ బ్యాంకర్లను ఈ విషయం చాలా కలవరపాటుకు గురిచేస్తోంది.  పెద్ద నోట్ల రద్దు సమయంలో తొలి రెండు నెలలు ప్రజలు డబ్బుల కోసం పడరానిపాట్లు పడ్డారు. ఆ తరువాత కొంత సర్దుకున్నప్పటికీ నానాటికీ పెరుతున్న బ్యాంకుల నిబంధనలు వినియోగదారులను బ్యాంకు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బ్యాంకులు ఏంటీఎంల ద్వారా నగదులావాదేవీలపై చార్జీల భారం మోపుతుండటం,  మినిమం బ్యాలెన్స్‌ ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో నగదు జమచేయడం లేదు. దీనికి తోడు ఎఫ్‌డీఐ రూమర్లపై రిజర్వ్‌బ్యాంక్‌ కూడా స్పష్టమైన ప్రకటనేదీ వెలువరించకపోవడంతో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగదుకు తీవ్ర కొరత ఏర్పడింది.   

బ్యాంకుల్లోనూ∙కొరత:  జిల్లాలో మొత్తం 36 ప్రిన్సిపల్‌ బ్యాంకులుండగా.. వాటికి 456 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ఆయా బ్యాంకుల శాఖలకు సంబంధించిన 556 ఏటీఎం కేంద్రాలున్నాయి. మరో 50 దాకా ఏటీఎంలను ఇండిక్యాష్‌ తదితర  ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. బ్యాంకర్లు తెలిపిన మేరకు  ఆయా బ్యాంకులు, వాటి శాఖలు,  ఏటీఎంలలో సాధారణ సమయాల్లో అయితే రోజుకు రూ.50 నుంచి 70 కోట్ల మేర నగదు ఉపసంహరణలు జరుగుతుండగా..అదే మొత్తంలో నగదు డిపాజిట్లు (జమ)జరుగుతుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది బ్యాంకుల్లో డబ్బును జమ చేసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నగదు డిపాట్, ఉప సంహరణల తేడా 20 నుంచి 30 శాతం ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం డబ్బులో 30 శాతం దాకా వినియోగదారులు తమ వద్దే ఉంచుకుంటున్నట్లు సమాచారం. దీంతోనే బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆర్‌బీఐ నుంచి నగదు రాకపోవడం కూడా కరెన్సీ కటకటకు మరో కారణంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు