తటస్థులకు టిక్కెట్లిస్తాం: నారా లోకేశ్

10 Nov, 2013 02:36 IST|Sakshi

పార్టీకోసం బాలకృష్ణ, ఎన్టీఆర్ కృషి చేస్తారు
 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తటస్థులకు టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ చెప్పారు. సమర్థులైన తటస్థులను గుర్తించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా తెలుగుయువత, విద్యార్థి నేతలను కోరారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పార్టీ నేతల కుమారులతోపాటు తెలుగుయువత, విద్యార్థి నేతలతో లోకేష్ శనివారం చంద్రబాబు నివాసంలో విడివిడిగా సమావేశమయ్యారు. లోకేష్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు తెలిపిన వివరాల ప్రకారం... ‘‘వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు మా కుటుంబం మొత్తం తీవ్రంగా కష్టపడుతుంది. నాన్నగారు, నేను, మామయ్యలు హరికృష్ణ, బాలకృష్ణలు, సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా కృషి చేస్తారు. మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించాలి’’ అని లోకేష్ కోరారు. తాను కూడా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిర్వహించే సదస్సుల్లో పాల్గొంటానని, జిల్లా వారీ సభల్లో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా నేత ఒకరు చెప్పగా లోకేష్ ససేమిరా అన్నారు.
 
 సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాలు పార్టీకి రెండు కళ్లని, ఏ ఒక్క క ంటినీ పోగొట్టుకోలేమని చెప్పారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేసిన తరువాతనే రాష్ట్రాన్ని విభజించాలన్నారు. తాను తెలంగాణలో పుట్టి కోస్తా ప్రాంతానికి అల్లుడిని అయ్యానని, తన కుటుంబం అంతా రాయలసీమలో ఉందని, అందువల్ల తనకు ఏ ప్రాంతం పట్ల వివక్ష లేదని తెలిపారు. సమావేశంలో యువత, విద్యార్థి నేతలు బీద రవిచంద్రయాదవ్, పాందువ్వ శ్రీను, జిమ్మీబాబు, పుల్లారావు యాదవ్, పార్టీ నేతల కుమారులు పరిటాల శ్రీరాం, కరణం వెంకటేష్, చింతకాయల విజయ్‌పాత్రుడు, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్వహిస్తున్న మేధోమధన సదస్సులో రెండో రోజున లోకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తన తండ్రి చంద్రబాబు కంటే ముందే ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న లోకేష్ సుమారు గంటన్నరకు పైగా కుప్పం ఫార్ములా గురించి నేతలకు వివరించారు.
 

>
మరిన్ని వార్తలు