‘సహకారం’ కరువైంది!

26 Oct, 2013 03:29 IST|Sakshi

ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్ :  ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో తూగుతుండడం.. వారికి, ఫీల్డ్‌స్టాఫ్‌కు మధ్య కోల్డ్‌వార్ నడస్తుండడంతో రైతులకు చేయూత కరువవుతోంది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్నదాతను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు వివిధ రంగాలు ముందుకు వస్తున్నాయి. కానీ రైతుల సామూహిక పెట్టుబడులు, టర్నోవర్‌తో ఏర్పాటైన సహకారబ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కర్షకులను పక్కన బెట్టి కమర్షియల్‌గా ఆలోచిస్తూ స్వాహా పర్వానికి తెరలేపుతోంది. ఎమ్మిగనూరు సహకార బ్యాంక్‌లో పంట రుణాలు పొందేందుకు రైతులు కూడా మామూళ్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
 కేడీసీసీ బ్యాంక్‌కు, గ్రామీణ సింగిల్‌విండో సొసైటీలకు అనుసంధానంగా పని చేస్తున్న ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ రైతులకు అన్ని విధాలా చేయూతనివ్వాల్సి ఉంది. బ్యాంకు పరిధిలో కడిమెట్ల, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, కలుదేవకుంట సింగిల్‌విండో సంఘాలు ఉన్నాయి. 39,553 మంది రైతులు సహకార సంఘాల సభ్యులుగా ఉన్నారు. వారిలో 6,889 మంది రైతులకు మాత్రమే పంటరుణాలు అందుతున్నాయి. మిగిలిన వారి గురించి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం మొత్తం రూ.12 కోట్ల రుణాలను రైతుల మధ్య టర్నోవర్‌గా చూపుతున్నారు.

ఈ యేడాది వ్యక్తిగత రుణాల కింద రూ.96 లక్షలను ఉద్యోగులు, వ్యాపారులకు అందజేశారు. రూ.65 లక్షలు గోల్డ్‌లోన్‌ను రుణాలుగా మార్చారు. కానీ ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన ఎస్టీ లోన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. బ్యాంక్‌సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్ మధ్య ఏర్పడ్డ వివాదం, మామూళ్ల పంపిణీలో తేడాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
 పైసలిస్తేనే పంటరుణాలు
 ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ స్థాయిని పెంచి కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక అధికారులు, సిబ్బంది స్వాహాలపర్వానికి తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు సింగిల్‌విండో సొసైటీలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది బినామీల పేరుతో ఏకంగా రూ.9 లక్షలను స్వాహాచేశారు. విషయం వెలుగులోకి వచ్చి ఆరు నెలలైనా జిల్లా సహకార బ్యాంక్ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా విచారణ పూర్తయి, ఆడిట్ జరిగే వరకూ ఆ సొసైటీ పరిధిలోనే రైతులకు పంటరుణాలు అందటం కష్టమే.

బ్యాంక్ కార్యాలయంలో కొంతమంది చేతివాటం బ్యాంక్ ప్రతిష్టను మరింత భ్రస్టుపట్టించింది. వ్యక్తిగత లోన్లకుగాను లక్ష రూపాయలకు రూ.3 వేలు చొప్పున ముడుపులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. రైతులకిచ్చే దీర్ఘకాలిక రుణాలకు కూడా స్థాయిని బట్టి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 మామూళ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఈ ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేయాల్సిన రూ.60 లక్షలను ఇవ్వకుండా కేంద్రబ్యాంక్‌కు రిటర్న్ చేసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మిగనూరు బ్రాంచ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ చేపట్టాలని రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు  కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు