ఈ ఏడాదీ నో క్రషింగ్

8 Sep, 2015 02:34 IST|Sakshi
ఈ ఏడాదీ నో క్రషింగ్

స్పందించని చిత్తూరు షుగర్స్
పాలకవర్గం, అధికారులు
పట్టించుకోని ప్రభుత్వం
బకాయిలందక అవస్థల్లో  కార్మికులు, రైతులు

 
చిత్తూరు:  ‘జిల్లాలో చెరుకు రైతులకివ్వాల్సిన రూ.20 కోట్ల బకాయిలు రెండు రోజుల్లో చెల్లిస్తాం. ఈ ఏడాదే చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్ చేపట్టి వారిని అన్నివిధాలా ఆదుకుంటాం’.  ఇదీ 11-12-2014న చిత్తూరు పర్యటనలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు. ఆ తరువాత బకాయిలు ఇచ్చిందీ లేదు.. క్రషింగ్ నిర్వహించిందీ లేదు. ఈ ఏడాదీ క్రషింగ్ ప్రారంభించే సూచనలు కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఏం చేయాలో తెలియక చెరుకు రైతు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లాలో చెరుకుపంట సాధారణ సాగువిస్తీర్ణం 27,705 హెక్టార్లు. కాగా ఈ ఏడాది 20,860  హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 26,147 వేల హెక్టార్లలో సాగుచేశారు. అయితే కర్మాగారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మూసేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాదితో  పోల్చితే ఆరు వేల హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కనీసం ఈ ఏడాదైనా తిరిగి క్రషింగ్ నిర్వహించక పోతారా..! అన్న ఆశతో చాలామంది రైతులు చెరుకుపంట సాగుచేశారు. వాస్తవంగా జూన్ మొదటి వారంలో కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభం కావాలి. క్రషింగ్ నిర్వహించే క్రమంలో చెరుకు సాగుతోపాటు చెరుకు సరఫరాకు సంబంధించి చక్కెర కర్మాగారం రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలి. కానీ ఈ ఏడాది ఇంతవరకు అలాంటివేమీ జరగలేదు. ఈ ఏడాదీ చెరుకు క్రషింగ్ జరిగే అవకాశం లేదని కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. కానీ ఈ విషయంపై అటు షుగర్‌కేన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ నోరుమెదపడంలేదు.

 బకాయిలు చెల్లించని ప్రభుత్వం
 2011-12, 2012-13 ఏడాదిలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.6.57 కోట్ల బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. ఇక కార్మికులకు సంబంధించి 1-01-2014 నుంచి జులై 2015 వరకు చెల్లించాల్సిన రూ.7.10 కోట్ల బకాయిలతో పాటు 2011 నుంచి ఇప్పటివరకు పీఎఫ్ రూ.3.50 కోట్లు, గ్రాట్యుటీ రూ.92 లక్షలతో కలిపి మొత్తం కార్మికులకు రూ.11.52 కోట్లు  చెల్లించాలి. రైతు బకాయిలతో కలిపితే రూ.18.09 కోట్లు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా చెల్లించక పోవడంతో అటు రైతులు, ఇటు కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

 అమ్మకానికే మొగ్గు!
 రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబునాయుడు తాను అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు మొగ్గుచూపారు. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేశారు. ఇందులో భాగంగానే కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు