ఏదీ.. ఆనాటి ఫైర్!

8 Mar, 2014 02:31 IST|Sakshi

 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: అంతన్నాడింతన్నాడో గంగరాజు.. అన్నట్లుంది అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారుల తీరు. కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్న అత్యుత్సాహంతో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ఆకాశానికి నిచ్చెన వేస్తూ విద్యార్థులను ఆకర్షించడం.. ఆనక చేతులు ముడుచుకొని కూర్చోవడం.. ఫలితంగా తక్కువ ఫీజులతో కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశం అందిపుచ్చుకోవచ్చని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఇప్పుడు నేలచూపులు చూడాల్సిన దుస్థితి. గత ఏడాది ప్రారంభించిన ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే.
 
 ఆర్భాటంగా ప్రారంభం
 కొత్త కోర్సుల ఏర్పాటులో భాగంగా 2013 మార్చి 13న డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇండస్ట్రియల్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ పీజీ డిప్లమా కోర్సు ప్రారంభించారు. విశాఖపట్నానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేప్టీ మేనేజ్‌మెంట్ సంస్థకు శిక్షణ బాధ్యత అప్పగించారు. ఆర్‌జీబీ భగవత్‌కుమార్ ఇన్‌చార్జి వీసీగా ఉన్నప్పుడు.. గత ఏడాది జనవరి 9న సంయుక్తంగా కోర్సు నిర్వహణ, సర్టిఫికెట్ అందజేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం.. తదితర అం శాలపై ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకున్నారు. షేర్‌మహ్మద్ పురంలోని 21వ శతాబ్ది గురుకులంలో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం 60 మంది కోర్సు చేస్తున్నారు. ఈ నెలలో శిక్షణ పూర్తి అవుతుంది. వీరందరికీ ఒప్పందం ఉపాధి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో  అసలు రంగు బయటపడుతోంది.
 
 ఎన్నో గొప్పలు
  కోర్సు ప్రారంభం సందర్భంగా ఎన్నో గొప్పలు చెప్పారు. అదంతా డొల్లేనని ఇప్పుడు అర్థమవుతోంది. తరగతి గదికే బోధనను పరిమితం చేయకుండా  క్షేత్రస్థాయి పరిశీలన, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ సిలబస్ రూపొం దించామన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు- నివారణ చర్యలు, ప్రమాదాలను ఎదుర్కొనే విధానం, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థల్లో ప్రమాదాలకు అవకాశాలు-నివారణ చర్యలు, ప్రమాద నియంత్రణ చర్యలపై సంపూర్ణ పరిజ్ఞానం కల్పిస్తామన్నారు. వీటితో పాటు ఆంగ్ల పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను బోధిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తు తం 20 శాతం సంస్థల్లో మాత్రమే అగ్ని ప్రమా ద స్వీయ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని, అందుకే ఈ కోర్సుకు డిమాండు పెరిగిందని.
 
  పీజీ డిప్లమా చేసిన వారికి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు, సూపర్ వైజర్లుగా బోల్డన్నీ ఉద్యోగాకావశాలు లభిస్తాయని ఎన్నో ఆశలు కల్పిస్తూ ప్రచారం చేశారు. అలాగే కోర్సు ఫీజు రూ.60 వేలని.. అయితే గ్రామీణ ప్రాంతమైనందున ఇక్కడ కోర్సులో చేరిన వారు రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. తీరా కోర్సులో చేరాక మెస్ బిల్లు కాకుండా ఫీజు రూ.30 వేలతోపాటు పుస్తకాలకు రూ.2 వేలు, పరిశ్రమల్లో క్షేత్ర పరిశీలన(విశాఖకు తీసుకెళ్లారు) పేరుతో రూ.2 వేలు, హెల్మెట్, దస్తులకు మరో రూ.2 వేలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు రూ.600 చొప్పున అదనంగా వసూలు చేశారు. ప్రారంభంలోనే రూ.20 వేల జీతం వస్తుందని ఆశ పెట్టడంతో నమ్మేసిన విద్యార్థులు వారు అడిగినంతా చెల్లించారు.
 
 రూ.5 వేల జీతానికి వెళ్లమంటున్నారు.
 నిర్వాహకుల తీరుతో ఈ నెలలోనే శిక్షణ పూర్తి చేసుకుంటున్న 60 మంది పరిస్థితి అయోమయంగా తయారైంది. వీరిలో సంతోష్ కుమార్ అనే విద్యార్థి సొంతంగా భువనేశ్వర్‌లోని ఓ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరై రూ.20 వేల జీతానికి ఎంపికయ్యాడు. మిగతా 59 మందికీ శిక్షణ సంస్థే ఉపాధి అవకాశం కల్పించాలి. అయితే ఉపాధి పేరుతో మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్ తదితర దూరప్రాంత రాష్ట్రాలకు.. అది కూడా రూ.5 వేల వేతనానికి వెళ్లాలని శిక్షణ సంస్థ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇంత ఖర్చు చేసి పీజీ డిప్లమా చేసి.. అంత తక్కువ వేతనానికి ఎలా వెళతామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా కొత్త బ్యాచ్ ప్రారంభిం చేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేం దుకు కొంతమంది విద్యార్థులు ప్రయత్నించగా నిర్వాహక సంస్థ ప్రతినిధులు వారిని బతిమాలి వెనుక్కు తీసుకెళ్లారు. అయితే ఎటువంటి ఉపాధి చూపిస్తారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. వర్సిటీ అధికారులు స్పందించి న్యాయం చేయక పోతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
 నా దృష్టికి రాలేదు
 ఈ విషయాన్ని వర్సిటీ రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ దృష్టికి ‘న్యూస్‌లైన్’ తీసుకువెళ్లగా విద్యార్థుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయినా రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నత కోర్సులు చేసిన వారికే ఉద్యోగాలు రావడం లేదు.. వేలల్లో ఖర్చు పెట్టి చేసిన కోర్సుకు ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయని  ప్రశ్నించారు.కోర్సు చేసిన వారికి ఉపాధి కల్పిస్తామన్న ఒప్పందం గురించి ప్రస్తావించగా.. అదంతా ఇప్పుడు అనవసరం. ఉపాధి చూపాల్సిన పని లేదు.. పరీక్షలు పూర్తయ్యాక సర్టిఫికెట్ చేతిలో పెట్టి రిలీవ్ చేస్తే చాలని తేల్చేశారు.
 
 

మరిన్ని వార్తలు