మహాసంప్రోక్షణకు అంకురార్పణ నేడే

11 Aug, 2018 04:03 IST|Sakshi
ఖాళీగా కనబడుతున్న తిరుమలకు వెళ్లే టోల్‌గేట్‌ తనిఖీ కేంద్రం, ఖాళీగా దర్శనమిస్తున్న సర్వదర్శన క్యూలు

     నేటి నుంచి 16వ తేదీ వరకు క్రతువు

     శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

     భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల

     ఎనిమిది టన్నుల పూలతో సంప్రోక్షణ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా ప్రారంభం కానుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవాలయాల్లో లోక సంక్షేమం కోసం ప్రతి 12 ఏళ్లకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలు ఏర్పాటుచేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్వికులు, వంద మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణం చేస్తారు. 1958, ఆగస్టు నెలలో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణకవచ తాపడం జరిగింది. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతుండడం విశేషం.

అన్ని ఆర్జిత సేవలు రద్దు
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు రూ.300.. సర్వదర్శనం.. దివ్యదర్శనం టోకెన్ల పంపిణీని నిలిపివేయనున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు (వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు) రద్దయ్యాయి.

సంప్రోక్షణకు 8 టన్నుల పూలు
ఇదిలా ఉంటే.. మహాసంప్రోక్షణకు ఎనిమిది టన్నుల పూలను ఉపయోగించనున్నారు. సంప్రోక్షణ ప్రారంభం నుంచి ముగింపు వరకు సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ చేయనున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కర్నూలు, సేలంకు చెందిన పలువురు భక్తులు కట్‌ ఫ్లవర్స్‌ను దేవునికి విరాళంగా సమర్పించనున్నారు.

బోసిపోయిన తిరుమల
మహాసంప్రోక్షణ పురస్కరించుకుని స్వామి వారికి పూజా కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున దర్శన సమయాన్ని టీటీడీ కుదించింది. అలాగే, మహాసంప్రోక్షణపై విస్తృత ప్రచారం చేయడంతో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. టైంస్లాట్, కాలినడక కౌంటర్ల క్యూ నిర్మానుష్యంగా మారింది. ఐదు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ బోసిపోయింది.

మహా సంప్రోక్షణ వివరాలు..
శనివారం ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. దీన్నే ఆచార్యవరణం లేదా రుత్విక్‌ వరణం అంటారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపడతారు.
- 12వ తేదీ ఉదయం 6 గంటల తరువాత ఒక హోమ గుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటల తరువాత కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో రోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉ. 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు.
13న విశేష హోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో గర్భాలయంతోపాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భగుప్రకీర్ణాధికారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో వివరించి ఉంది. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా అష్టబంధనాన్ని సమర్పిస్తారు. 
15న ఉదయం కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవమూర్తులకు యాగశాలలోనే అభిషేకం చేస్తారు.
-16 ఉ.10.16 నుండి 12 గంటలలోపు కళావాహన చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు తిరిగి కుంభంలోని శక్తిని ఆవాహన చేస్తారు.ఆ తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ పంచమి సందర్భంగా అదేరోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది.

మరిన్ని వార్తలు