చేనేత.. మారని రాత

11 Feb, 2014 05:32 IST|Sakshi

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:
 జిల్లాలో వ్యవసాయం తర్వాత అంత స్థాయిలో విస్తృతమైనది చేనేత రంగం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదేళ్ల క్రితం జిల్లాలో చేనేతకారులు, కార్మికులు దాదాపు 50 వేల మంది ఉండగా ప్రస్తుతం 20 వేలకు పడిపోయింది. వీరిలో మహిళలు 8 వేల మంది ఉన్నారు. చేనేత పరిశ్రమలో మహిళలు కీలకంగా పని చేస్తున్న వీరికి ప్రభుత్వం నుంచి చేయూత లభించడం లేదు. బ్యాంకులు మహిళా చేనేత కారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఇప్పటికి ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, ప్యాపిలి, క్రిష్ణగిరి మండలాల్లో చేనేత పరిశ్రమపై ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డాయి. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం లేక పోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన చేనేతకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత రెండేళ్లలో 9 మంది చేనేతకారులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడినా వారికి ఎటువంటి చేయూత లభించలేదు. నిబంధనల ప్రకారం రూ.1.50 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉండగా అతీ గతీ లేదు.
 
 వీవర్ క్రెడిట్ కార్డులకు రుణాలు ఏవీ?
 చేనేతకారులకు క్రెడిట్ కార్డుల ద్వారా ఎటువంటి హామీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయం బ్యాంకులు కల్పించాల్సి ఉంది. జిల్లాలో 3100 మందికి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా బ్యాంకులు కేవలం 153 మందికి మాత్రమే రుణాలు ఇచ్చాయి. ఇందులో మహిళల్లో కేవలం 23 మందికి మాత్రమే రుణాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రివైవర్, రీఫామ్స్, రీస్ట్రక్చరింగ్(త్రిబుల్ ఆల్) కింద చేనేతకారుల అన్ని రకాల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. జిల్లాలో 16 చేనేత సహకార సంఘాలకు సంబంధించి రూ.6.87 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి స్పందన కరువయింది. సమగ్ర చేనేత అభివృద్ధి పథకం కింద ఎమ్మిగనూరు, కోడుమూరు క్లస్టర్లను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లోని మహిళా చేనేతకారులను డిజైనింగ్, తదితర వాటిపై శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
 
 విచ్ఛిన్నమవుతున్న సంఘాలు:
 బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేనేత సహకార సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా ఇందులో 5 వేల మంది సభ్యులు ఉన్నారు. మహిళలు 2 వేల మంది ఉన్నారు. ప్రోత్సాహం కరువు కావడంతో 23 సంఘాలు పని చేయడం లేదు. 20 సంఘాలు మాత్రమే కొంత వరకు రాణిస్తున్నాయి. మహిళలకు నూలు సబ్సిడీ స్కీమ్ అమలు కావడం లేదు. బీమా పథకాలు ఉన్న ప్రచారం లేక మూలన పడుతున్నాయి. మహాత్మా గాంధీ బోంకార్డు బీమా యోజన, ఆరోగ్య బీమా పథకాలు ఉన్న మహిళలకు వర్తింపజేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. చేనేతకారులకు రునాలు ఇప్పించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్న బ్యాంకర్లు ఖాతరు చేయడం లేదు.
 
 జిల్లాలో పరిస్థితి ఇదీ:
  ఆదోనిలో బెంచీ, మగ్గం, గుంత మగ్గాలతో దుస్తుల తయారీ చేస్తున్నారు.  మగ్గాలతో నేసిన లుంగీలు, చీరలు, టవల్, దోమతెరలు, బెడ్‌షీట్‌లను ప్రభుత్వమే కొనుగోలు చేయక పోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు.
 
  ఆలూరు, పత్తికొండ, హొళగుంద చేనేతలు తయారు చేసిన వస్త్రాలను చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగే సంతల్లో తక్కువ ధరకు విక్రయించుకుని కుటుంబీలను పోషించుకుంటున్నారు.   
 
  బనగానపల్లె పరిధిలో ఇల్లూరు కొత్తపేట, నందివర్గం, పలుకూరు తదితర గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలు చేనేత మగ్గలపై ఆధారడి జీవిస్తున్నారు. ఈ గ్రామ ప్రాంతాల్లో చేనేత సంఘాలు ఏర్పడినా మొక్కుబడిగా మారాయి. .
 
  తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల్లో 1,490 చేనేత కుటుంబాలు ఉండగా  80 శాతం మంది మగ్గాలకు స్వస్తి పలకగా కేవలం అతికష్టంపై 110 కుటుంబాలు మాత్రమే చేనేత కార్మికులుగా కొనసాగుతున్నారు.
 
 
 ఈమె పేరు పార్వతి. ఎమ్మిగనూరులో నివసిస్తోంది. భర్త హోటల్‌లో పనిచేస్తుండటంతో కుటుంబానికి తన వంతుగా అసరాగా ఉండాలని మగ్గం వైపు మొగ్గు చూపింది. వారానికి ఒక చీరను నేసే సామర్థ్యం ఉన్నా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో వృత్తిపై ఆసక్తిని చంపుకుంది. నెలకు రెండుకు మించి చీరలను నేయడం లేదు.  ప్రభుత్వం నుంచి సబ్సిడీపై ముడి సరుకు అందక పోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వక తదితర కారణాలతో తమ ప్రాంతంలో చేనేతలు దుకణాల్లో, హోటళ్లలో కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు