చూడీ లేదు..పాడీ లేదు

21 Feb, 2014 01:13 IST|Sakshi

 వట్టిపోయిన పశుపిండోత్పత్తి కేంద్రం
 శిథిలావస్థకు చేరిన ప్రయోగశాలలు
 బీడుగా మారిన 530 ఎకరాలు
 పశువుల పెంపకానికే పరిమితం
 భూములపై కన్నేసిన కబ్జాదారులు
 గడ్డిపెంపక కేంద్రంగా ప్రతిపాదనలు
 
 సాక్షి, నరసరావుపేట
 మేలుజాతి పశువుల పునరుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ (పశు పిండోత్పత్తి కేంద్రం) వట్టిపోయింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు శిధిలావస్థకు చేరాయి. ఐదు దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం బఫెలో బ్రీడింగ్ సెంటర్ నెలకొల్పింది. అయితే సాగర్ నిర్మాణ సమయంలో ఈ కేంద్రం ముంపు బారినపడటంతో నకరికల్లు మండలం నర్సింగపాడు శివారులోని 530 ఎకరాల అటవీ భూముల్లోకి దీనిని మార్పు చేసింది. దీని అవసరాల కోసం త్రిపురాపురం వద్ద 130 ఎకరాల భూమిని కేటాయించింది.
 
  గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేసే జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్‌డీడీబీ) ఏర్పాటు చేసిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ సహకారంతో ఇక్కడ మేలు జాతి ముర్రా గేదెలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం నర్సింగపాడు శివారులో ప్రయోగశాలలు నిర్మించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా  ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు కలిగిన గృహ సముదాయాలు నిర్మించారు. త్రిపురాపురంలోని130 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన గేదెలను పరీక్షల నిమిత్తం ఇక్కడ ఉంచేవారు. ఆరు,ఏడు నెలల అనంతరం వాటికి ఎలాంటి జబ్బులు లేవని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే బీబీసీ కేంద్రానికి తీసుకొచ్చి పునరుత్పత్తి జరిపేవారు. ఈమేలు రకం గేదెల గర్భాశయంలో పిండాలను వృద్ధి చేసి ఏడు రోజుల తరువాత వాటిని ఎదకు వచ్చిన స్థానిక గేదెల గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ పాలు ఇచ్చే మేలు జాతి గేదెలను ఉత్పత్తి చేయడమే ఈ సెంటర్ లక్ష్యం. మొదట్లో బ్రహ్మాండంగా కొనసాగిన ఈ కేంద్రం రానురాను పాలకులు, అధికారుల అలసత్వంతో లక్ష్యాన్ని చేరుకోలేక 1992లో మూతపడింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్థి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థకు క్షీణదశ మొదలైంది. కొన్నాళ్లు పాడిగేదెల కేంద్రంగా, మరికొన్నాళ్లు గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా ఈ సంస్థను మార్చారు.
 
 పశువుల పెంపకానికే పరిమితం
     వేల కోట్ల విలువైన పొలాలు, కట్టడాలు, అధునాతన సాంకేతిక  పరికరాలు ఉన్న బీబీసీ కేంద్రం ప్రస్తుతం సామాన్య పశువుల పెంపక కేంద్రంగా మారింది.
 
      ఐదేళ్ళపాటు వీర్యం ఉత్పత్తి కేంద్రంగా పనిచేసిన బీబీసీ 2005 నుంచి కేవలం ముర్రాజాతి దున్నలు, జెర్సీ, ఒంగోలు జాతి కోడెదూడల కేంద్రంగా మారింది.
 
     గతంలో డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్, శాస్త్రవేత్తలు, వైద్యులు, వందమంది సిబ్బంది, 10 ట్రాక్టర్లతో కళకళలాడిన బీబీసీ కేంద్రం నేడు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు.
 
 భూములపై కన్ను...
 త్రిపురాపురంలో ఉన్న 130 ఎకరాల భూములను ఆక్రమించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ కేంద్రంపై ప్రభుత్వం శ్రద్ధ వహించి పశుపరిశోధనా సంస్థగా మారిస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశువులకు అవసరమైన వీర్యాన్ని ఇక్కడి నుంచే అందించే వీలుంటుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రంలో గడ్డి పెంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినా వేసవిలో పశువులకు మేతలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తీరడంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.
 
 

మరిన్ని వార్తలు