సిగ్గు పడాలి

9 Dec, 2013 04:42 IST|Sakshi

 న్యూస్‌లైన్ బృందం, అనంతపురం : జిల్లాలో 2,963 ప్రాథమిక, 504 ప్రాథమికోన్నత, 602 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే ప్రత్యేకావసరాల పిల్లల (వికలాంగులు) కోసం 13 పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలుండాలి. అయితే, జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించడం లేదు. చాలా చోట్ల మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న చోట కూడా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. మొత్తం 4,069 ప్రభుత్వ పాఠశాలలకు గాను 666 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గుర్తించిన ఆర్వీఎం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో ప్రభుత్వం 2011-12 విద్యా సంవత్సరంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.

ఒక్కో మరుగుదొడ్డికి రూ.45 వేల చొప్పున మొత్తం రూ.2.99 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు 600 పూర్తికాగా, 66 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో మునిసిపల్ ట్యాంకర్ల ద్వారా మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు. గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్లపై సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి, వాటికి ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే... చాలా చోట్ల సింటెక్స్ ట్యాంకులు  ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 రెండు నెలల్లో సమస్య పరిష్కరిస్తాం    
 ప్రతి యేటా మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, వాటిని నిర్మిస్తున్నాం. అయితే... పర్యవేక్షణ సరిగా లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సెలవుల్లో ఇతరులు ప్రవేశించి మరుగుదొడ్లను అధ్వానం చేస్తున్నారు. వీటిపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు దృషి ్టసారించేలా అవగాహన కల్పిస్తాం. ఏదిఏమైనా రెండు నెలల్లో పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించి తీరతాం.
 - రామారావు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు