వసతి లోగిళ్లకు కొత్త సొబగులు

4 Aug, 2019 10:12 IST|Sakshi
లక్ష్మీనర్సుపేట గ్రామంలోని ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్‌ దుస్థితి..  ఇక ఈ కష్టాలు తొలగినట్టే.. 

సాక్షి, శ్రీకాకుళం : సంక్షేమ వసతి గృహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. భారంగా మారాయని దశల వారీగా మూసివేసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారన్న కారణంతో పాఠశాలలను మూసివేసినట్టే వసతి గృహాలను ఎత్తి వేసింది. ఆ హాస్టళ్ల విద్యార్థినీ విద్యార్థులను పక్కనున్న వసతి గృహాలకు తరలించింది. ఈ క్రమంలో వేలాది మంది విద్యార్థులు డ్రాపౌట్‌ అయిపోయారు. అయితే విద్య, సంక్షేమాన్ని లాభాపేక్ష ధోరణితో చూడకుండా అందరికీ చదువును అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. పిల్లల చదువుల కోసం ఖర్చుకు ఎంతైనా వెనకాడనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టి గాడిలో పెట్టేందుకు జిల్లాకు రూ.14 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. ఆమేరకు దశల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. 

ప్రభుత్వ విద్యను నీరుగార్చిన చంద్రబాబు
చంద్రబాబు ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసింది. కార్పొరేట్‌ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ విద్యను నీరుగార్చేశారు. తనకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉన్న కార్పొరేట్‌ శక్తులకు తలొగ్గి  ప్రభుత్వ పాఠశాలలను, సంక్షే మ వసతి గృహాలను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేశారు. నిర్లక్ష్యం బారిన పడి అవన్నీ సమస్య ల లోగిళ్లుగా తయారైపోయా యి. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పాఠశాలలు, వసతి గృహాలు ఆర్థికంగా భారమయ్యాయని ఏకంగా మూసివేశా రు. జిల్లాలో 35 పాఠశాలలను మూసివేయగా, 35 ఎస్సీ సంక్షే మ వసతి గృహాలను, 20 బీసీ సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేశారు. దీని వల్ల వేలాది విద్యార్థులు పొరుగునున్న పాఠశాలల కు, వసతి గృహాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేశారు. 

ప్రస్తుతం పాఠశాల విద్యకు మహర్దశ
నిర్వీర్యమైపోయిన విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలలను తెరవాలని నిర్ణయించుకున్నారు. పిల్లల్ని చదివించే తల్లులకు ప్రోత్సాహంగా అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ బడులు, వసతి గృహాల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఇప్పటికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని చర్యలు తీసుకున్నారు.

అందులో భాగంగా స్కూల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎస్‌టీఎంఎస్‌) సర్వే కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల స్థితిగతులపై నివేదికను సిద్ధం చేయిస్తున్నారు. తదనుగుణంగా పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల జిల్లాలో 2500 ప్రాథమిక పాఠశాలలు, 661 ప్రాథమికోన్నత పాఠశాలలు, 694 ఉన్నత పాఠశాలల్లో మోక్షం కలగనుంది. 

వసతి గృహాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు
సమస్యలతో, మౌలిక సౌకర్యాల లేమితో అవస్థలకు గురవుతున్న వసతి గృహాలపై కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 40 సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం తొలి విడతగా రూ.52 లక్షలు మంజూరు చేశారు. అలాగే 71 బీసీ సంక్షేమ వసతి గృహాలకు రూ.45.21 లక్షలు విడుదల చేశారు. వీటితోపాటు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 12 గురుకులాలకు రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు కూడా వచ్చాయి. అలాగే, 32 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)కు రూ.2.5 కోట్ల మేర అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అవి కూడా రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. నిధుల విడుదల ఉత్తర్వుల మేరకు సంక్షేమ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం అంచనాలు రూపొందించి ఇవ్వాలని ఇంజినీరింగ్‌ శాఖాధికారులకు ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశించారు. 

తొలుత మరుగుదొడ్ల మరమ్మతులు, రన్నింగ్‌ వాటర్, మరుగుదొడ్లకు తలుపులు, సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణం, విద్యుత్‌ సమస్యలు, తాగునీటి కోసం ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ స్పష్టంగా సూచించారు. ఇంజినీరింగ్‌ అధికారులు ఇప్పుడా పనిలో  నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో ఎన్నాళ్ల నుంచో మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పాఠశాలలు, వసతి గృహాలకు మోక్షం లభించినట్టు అయింది.  

మరిన్ని వార్తలు