ఎమ్మెల్యే సారూ.. ఫైర్‌ స్టేషన్‌ ఏదీ?

2 Apr, 2019 11:01 IST|Sakshi
అగ్నిమంటలు అదుపుచేస్తున్న ఫైర్‌ సిబ్బంది(ఫైల్‌)

పాతపట్నం ప్రజల పాట్లు

సాక్షి, ఎల్‌.ఎన్‌.పేట(శ్రీకాకుళం): నియోజకవర్గం కేంద్రంలో ఫైర్‌ స్టేషన్‌ (అగ్నిమాపక కేంద్రం) ఏర్పాటుకు దిక్కు లేకుండా పోయింది. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు పలాస, టెక్కలి, ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడిలోని అగ్నిమాపక కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడి నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నియోజకవర్గంలో కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో 140 పంచాయతీలు ఉన్నాయి. అధిక శాతం గిరిజన గ్రామాలే. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కొత్తూరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి కొత్తూరు, హిరమండలం ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ రెండు మండలాలు తప్పితే మిగిలిన మూడు మండలాలకు పక్కన ఉన్న ఆమదాలవలస, టెక్కలి, పలాస నియోజకవర్గాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి నుంచి వచ్చే ఫైర్‌ ఇంజిన్లే దిక్కవుతున్నాయి. అధికారంలోకి వస్తే పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఐదేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ఒడిశా ఫైర్‌ ఇంజినే దిక్కు..
పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా పక్కనే ఉన్న పర్లాకిమిడి ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేస్తాం. అక్కడ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
– కొండాల అర్జునుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పాతపట్నం  

మరిన్ని వార్తలు