ఆ బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకుంటాం

27 Oct, 2013 06:49 IST|Sakshi

మార్కాపురం, న్యూస్‌లైన్ : బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను 26 నుంచి 49 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఆ బిల్లును అడ్డుకుంటామని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు స్పష్టం చేశారు. ఎల్‌ఐసీ నెల్లూరు డివిజన్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉద్యోగుల 19వ మహాసభలు స్థానిక బొగ్గరపువారిసత్రంలోని ఎంకే పాండే హాల్‌లో శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభలకు చైర్మన్‌గా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తుండగా మొదటిరోజు ముఖ్య అతిథిగా మధు పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల బిల్లును పార్లమెంట్ బయట, లోపల అడ్డుకుంటామని తెలిపారు. ఎల్‌ఐసీ ప్రారంభంలో కేవలం 5 వేల కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 13.17 లక్షల కోట్ల రూపాయలకు ఆస్తులు చేరుకున్నాయన్నారు. గత ఏడాది డివిడెండ్ రూపంలో 1,138 కోట్ల రూపాయలను కేంద్రానికి ఎల్‌ఐసీ చెల్లించిందన్నారు. కేంద్రం తీసుకుంటున్న అప్పుల్లో 25 శాతం ఎల్‌ఐసీ ఇస్తుందన్నారు. ప్రజల దగ్గర నుంచి చిన్నచిన్న మొత్తాలు సేకరించి పాలసీ గడువు తీరిన తర్వాత సకాలంలో చెల్లిస్తుందన్నారు. దేశంలోని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 84 శాతం మాత్రమే క్లెయిమ్‌లు పరిష్కరిస్తుండగా, ఎల్‌ఐసీ 99 శాతం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇలాంటి బలమైన రంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు, విదేశీయుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అవినీతికి తావులేకుండా సామాజిక బాధ్యతతో ఎల్‌ఐసీలోని ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రశంసించారు.
 
 ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి ఉందని, ఉద్యోగ, కార్మికవర్గాల మధ్య పాలకులు చిచ్చుపెట్టారని విమర్శించారు. రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం ముంచుకోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద రాజ్యాల కనుసన్నల్లో మన పాలకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలుచేసేందుకు పాలకులు పోటీపడటం శోచనీయమన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగులు సంఘటితంగా ఉండి ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరివి కావచ్చని పేర్కొన్నారు.
 
 యూనియన్ నెల్లూరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, నగేష్ మాట్లాడుతూ 33 కోట్ల పాలసీలతో దేశంలోనే ఎల్‌ఐసీ అగ్రగామిగా ఉందన్నారు. సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఐక్యంగా ఉండి ఎదుర్కొందామన్నారు. యూనియన్ జాతీయ కోశాధికారి వి.రవి, రాజేంద్రకుమార్, ఫయాజుద్దీన్, స్థానిక శాఖ మేనేజర్ గురుప్యారా, జేవీవీ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, ఏజెంట్ల సంఘ అధ్యక్షుడు కోటిలింగం, ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు డాక్టర్ బీవీ శ్రీనివాసశాస్త్రి, డెవలప్‌మెంట్ ఆఫీసర్ల సంఘ అధ్యక్షుడు జవహర్, ఎల్‌ఐసీ ఉద్యోగుల సాంస్కృతిక విభాగం కార్యదర్శి జంకె శ్రీనివాసరెడ్డి, స్థానిక బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీనివాసరెడ్డి, కేశవరావు, సీఐటీయూ కార్యదర్శి డీకేఎం రఫి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు పిన్నిక లక్ష్మీప్రసాదయాదవ్, సీపీఎం పట్టణ నాయకులు సోమయ్య, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఒద్దుల వీరారెడ్డి, అధిక సంఖ్యలో ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
 
 పట్టణంలో భారీ ర్యాలీ...
 ఎల్‌ఐసీ 19వ వార్షికోత్సవ మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక కంభం రోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి నెహ్రూబజార్, పాతబస్టాండ్, నాయుడువీధి, మెయిన్‌బజార్ మీదుగా బొగ్గరపువారిసత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎల్‌ఐసీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు