స్థలాలు సరే.. నిధులేవీ?

7 Oct, 2014 00:49 IST|Sakshi

చిత్తూరు(టౌన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నిధులివ్వకనే అరచేతిలో వైకుంఠం చూపుతోంది. జిల్లాలో తొలివిడతగా 225 గ్రామ పంచాయతీలకు యార్డులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 135 యార్డులను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించగా మిగిలిన 90 యార్డుల బాధ్యతను జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తీసుకున్నారు. నిధులు రాకపోవడంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు.
 
ఏం చేయనున్నారంటే..
మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో పోగయ్యే చెత్తను సేకరించి యార్డులో ఎరువులను తయారు చేసి తద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలనేదే ప్రభుత్వ యోచన. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు యార్డుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించనుంది. తొలివిడతగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోరు డ్రిల్ చేసి, దానికి మోటారు అమర్చి, యంత్రాల వినియోగం కోసం షెడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందులో తయారైన ఎరువును ఆయా గ్రామ పంచాయతీలే అమ్ముకుని ఆదాయాన్ని పెంచుకునే ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది.
 
నిధులే సమస్య..
గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే స్థలాలనైతే ప్రభుత్వం కేటాయించింది కాని యార్డుల నిర్మాణానికి నిధులను మాత్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వం అనుకున్న విధంగా డంపింగ్ యార్డులను నిర్మించాలంటే ఒక్కో దానికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా మంజూరు చేయకుండా ఆదేశాలు మాత్రం జారీ చేసి మిన్నకుంది. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించిన 135 యార్డులకు ప్రభుత్వం కేటాయిచిన స్థలాలను ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు చూపలేదు. నిధులు మంజూరు కాక, కేటాయించిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులును వివరణ కోరగా యార్డుల పర్యవేక్షణ బాధ్యతను తమకైతే అప్పగించారు కానీ నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదన్నారు. తమకు కూడా నిధులు రాలేదని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు వివరించారు.

మరిన్ని వార్తలు