మీకెందుకు ప్రభుత్వ పథకాలు!

17 Dec, 2017 11:05 IST|Sakshi

 తప్పుడు పత్రాలతో పింఛన్లు, కార్డులు రద్దు

 ఉద్యోగాలు, భూములున్నాయంటూ ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం

 లబోదిబోమంటున్న నిరుపేదలు

బొబ్బిలి: జిల్లాలో ఈ రెండు కుటుంబాలే కాదు...వేల సంఖ్యలో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది.  ప్రభుత్వ ఉద్యోగులంటూ సుమారు 300 మందికి, భూములున్నాయని 3500 మందికి, వాహనాలు, ఇతర ఆస్తులున్నాయని మరో 11వేల మందికి కార్డులను తొలగించారు. వీరిలో కొందరికి పునరుద్ధరించగా సుమారు 4,600 మంది కార్డులు, పింఛన్ల కోసం తిరుగుతునే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, రేషన్‌కార్డు దారుల్లో నిజంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా రేషన్‌ కార్డులు జారీ చేశారు. మరికొంత మందికి అసలేమీ లేకుండానే తొలగించారు. 
సర్వే సిబ్బంది కొంత,

అధికారుల నిర్వాకం మరికొంత! 
గతంలో జరిగిన పల్స్‌ సర్వే ప్రకారం నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్ద ఎత్తున ఆస్తులున్నట్టు నమోదు జరిగింది. ఇందులో కార్లు, భవనాలు, ఇతర ఆస్తులున్నట్టు నమోదు చేసేశారు. ఇవో రకం తప్పిదాలయితే భూముల తప్పుల తడకల్లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు మరికొన్ని! దీని వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న ప్రయోజనాలే కాకుండా పలు సంక్షేమ పథకాలకు కూడా దూరమవుతున్నారు.

ఈ చిత్రంలోని మహిళ బాడంగి మండలం వీరసాగరానికి చెందిన  డోకల సింహాచలమమ్మ. రోజు వారి కూలి చేసుకునే ఈ కడుపేదకు పింఛను లేదు. భర్త అప్పలనాయుడు చనిపోయి ఏడాదైంది. పెళ్లయిన కొడుకు కోడలు ఆదుకుంటారనుకుంటే కోడలు చనిపోయింది. కుమారుడు ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఈ వయసులో ఇద్దరు మనవలను పెంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వితంతు పింఛను ఇవ్వాలని కోరితే మీకు 20 ఎకరాల పల్లం మాగాణి ఉందని రికార్డుల్లో నమోదై ఉండటంతో పింఛను ఇవ్వడం కుదరదని చెప్పేశారు అధికారులు.  మనవల్ని చూసి కుమిలిపోతూ కూలి పనికి వెళ్తోంది. ఆ డబ్బులతో పిల్లలకో ముద్ద పెట్టి తనో ముద్ద తింటోంది. కూలి పని లేని రోజు ఆ ముద్దా లేదు. 

ఈ చిత్రంలోని కుటుంబాన్ని చూ డండి! కుటుంబ యజమాని పేరు బంకురు శంకరరావు, ఆటో డ్రైవర్‌. రోజూ వాహనానికి కట్టాల్సిన ఫైనాన్స్, ఆయిల్‌ డబ్బులు, వడ్డీ డబ్బులు తీసేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే  భార్య నాగమణి, కుమారుడు గౌతమ్‌లను పెంచుకుంటున్నాడు.  రేషన్‌ కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకుంటే ఇచ్చారు. కానీ ఒక్క బియ్యం గింజయినా ఇవ్వక ముందే ఇతను ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొంటూ రేషన్‌ కార్డు డిలీట్‌ చేశారు. ఏడాదిగా ఇతను తహసీల్దార్‌ కార్యాలయానికి, కలెక్టరాఫీసుకు తిరుగుతునే ఉన్నాడు. కానీ రేషన్‌ కార్డు మంజూరు కాలేదు. 

జనం తిప్పలు ! 
జిల్లాలోని ఇటువంటి తప్పుడు ఆన్‌లైన్‌ నమోదుల కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరమవుతుంటే మరో పక్క జన్మభూమి కమిటీల పరంగా అర్హులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జన్మభూమి కమిటీల చేతుల్లో ఓ వైపు నలిగిపోతూ ప్రభుత్వ పథకాలంటే అర్రులు చాసేలా చూస్తున్న జనం మరో పక్క అధికారులు, ప్రభుత్వ సిబ్బంది తప్పుడు నమోదు కారణంగా సాఫ్ట్‌వేర్‌ స్కానింగ్‌లో అనర్హులైపోతున్నారు. వాస్తవానికి వారికి తిండి బట్టాలేని వారైనా ఐశ్వర్యవంతులుగా చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి ఇలా అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకూ సబబని జిల్లాలోని పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు