రహదారే రుద్రభూమి

20 Dec, 2013 03:06 IST|Sakshi

 పిఠాపురం, న్యూస్‌లైన్ :
 ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే బతికున్న వారికి చచ్చే చావే. ‘విలపించే వేళే కంట నలుసు పడ్డట్టు’.. ఆత్మీయులను పోగొట్టుకున్న దుఃఖానికి తోడు వారి మృతదేహాలను ఎక్కడ ఖననం లేదా దహనం చేయాలి అన్న చిక్కుసమస్య వారికి ఎదురవుతుంది. ఇదీ కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటవాసులను ఇరవై ఏళ్లుగా పీడిస్తున్న కాడు  సమస్య. దేశంలో బడి, గుడి లేని గ్రామం ఉంటుందేమో గానీ శ్మశానం లేని ఊరు ఉండదు. సుమారు వెయ్యిమంది జనాభా ఉన్న సుబ్బంపేటకూ ఒకప్పుడు శ్మశానం ఉండేది.
 
 జనాభాలో అత్యధికులు మత్స్యకారులైన ఈ ఊరు సముద్రానికి అతి సమీపంలో ఉంది. ఊరిని ఆనుకునే ఉన్న శ్మశానం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం సంభవించిన తుపాన్ల ఫలితంగా అలల కోతకు గురై కడలిలో కలిసిపోయింది. అప్పటి నుంచీ శ్మశానికి జాగా కేటాయించాలని గ్రామస్తులు అధికారులకు మొర పెట్టుకుంటున్నా.. వారి గోడు.. హోరుగాలిలో నిట్టూర్పులా.. వారికి చెవికి ఎక్కలేదు.
 
 శ్మశానం సముద్రంలో కలిసిపోయినప్పటి నుంచీ గత్యంతరం లేని స్థితిలో సుబ్బంపేటవాసులు బీచ్‌రోడ్డు మార్జిన్‌నే మరుభూమిగా వినియోగిస్తున్నారు. గతంలో మృతదేహాలకు సముద్రం వైపే ఖనన, దహనక్రియలు జరిపే వారు. అయితే అనేకసార్లు అలల ఉధృతికి సమాధులూ, వాటితో పాటు వాటిలోని మృతదేహాలూ సముద్రంలో కలిసిపోవడంతో బీచ్ రోడ్డుకు ఇటు వైపు అంత్యక్రియలు జరపసాగారు. దీనికి చేరువలోనే చేలున్న రైతులు అభ్యంతరం చెపుతున్నారు. అలాగే రోడ్డు మార్జిన్‌లోనే దహనక్రియలు జరిపేటప్పుడు వెలువడే పొగ, కమురు వాసనకు వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కొందరైతే అంత్యక్రియలు నిర్వహించే వారితో గొడవ పడుతున్నారు.
 
 ప్రభుత్వ కార్యాలయాల వద్దే అంత్యక్రియలు చేస్తాం..
 కడలి కెరటాల ఉధృతికి బీచ్ రోడ్డు పదేపదే ధ్వంసమవుతున్నా తిరిగి వేయిస్తున్న అధికారులు.. రెండు దశాబ్దాల క్రితం కడలి మింగిన వల్లకాడుకు ప్రత్యామ్నాయ స్థలం చూపడం లేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందో, లేదో తెలియదు కానీ.. బతికి ఉన్న తాము శ్మశానం లేక నరకం చవి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన తాము గతంలో సొంతంగా నిధులు పోగు చేసుకుని స్థానికంగా రోడ్లు నిర్మించుకున్నామని చెపుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ శ్మశానవాటికకు భూమి కేటాయించడం లేదని నిరసిస్తున్నారు. ఇప్పటికైనా స్థలం కేటాయించకపోతే ప్రభుత్వ కార్యాలయాల వద్దే అంత్యక్రియలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  
 
 శ్మశానం లేకపోవడం మా ఊరికి శాపం..
 మా గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే కాల్చడానికి పుల్లలు, కప్పెట్టడానికి గొయ్యి తవ్వడం కంటే అంత్యక్రియలు ఎక్కడ చేయాలన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. శ్మశానవాటిక లేకపోవడం మా గ్రామానికి శాపంగా మారింది. అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చినపుడల్లా తప్పక ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్ప ఎన్నేళ్లు గడుస్తున్నా పట్టించుకునే వారు లేరు.
 - కోనాడ అప్పయ్యమ్మ, మత్స్యకార మహిళ, సుబ్బంపేట
 
 కళ్లెదుటే చేపలు కొరుక్కు తింటున్నాయి..
 ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి అంతిమ సంస్కారాలకు దారి లేక సముద్రం పక్కన ఖననం చేస్తే మా కళ్లెదుటే ఆ శవాలు సముద్రంలో కలిసి పోయి చేపలకు ఆహారం ఆవుతున్నాయి. ఇంతటి దౌర్భాగ్యం మరెక్కడా ఉండదు. అలాగని శవాలను ఇళ్లల్లో పెట్టుకోలేం కదా?  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్మశాన వాటికకు భూమి కేటాయించాలి.
 - మేరుగు కొండబాబు, మత్స్యకారుడు, సుబ్బంపేట

మరిన్ని వార్తలు