‘గ్రేటర్‌’ ఆశాభంగం

26 Apr, 2019 10:14 IST|Sakshi
విజయవాడ సిటీ ఏరియల్‌ వ్యూ

గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతికి మంగళం

ప్రతిపాదనల దశ దాటని అమరావతి కార్పొరేషన్‌

80 పంచాయతీల అప్‌గ్రేడేషన్‌ ఎక్కడ?

డిజైన్లు, అంచనాలకు పరిమితమైన రోడ్ల విస్తరణ

ఐదేళ్లుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన సీఎం, మున్సిపల్‌శాఖ మంత్రి

సాక్షి, అమరావతి: నగరాల రూపురేఖల్ని మార్చేస్తున్నాం.. పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి, మున్సిపల్‌శాఖ మంత్రి తెగ ఊదరగొట్టారు. మాటల గారడీలతో ప్రజలను మాయచేశారు. రోడ్ల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పార్కులు, కాల్వ గట్టుల సుందరీకరణ, రివర్‌ ఫ్రంట్‌ టూరిజం.. అంటూ ఆయా నగరాలు, పట్టణాల ప్రజలను మబ్బుల్లో విహరింపజేశారు. ఇంకేముంది.. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు పచ్చ మీడియాకు లీకులిచ్చి మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోందంటూ ప్రచారం చేశారు. ఇవి కాకుండా గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతి, మున్సిపాల్టీల సంఖ్య పెంపు, 80 నగర పంచాయతీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. నిధులు అందుబాటులో లేకున్నా.. ఆచరణ సాధ్యంకాని ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేయించి అ«ధికారుల విలువైన కాలాన్ని హరించారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి పట్టణాలు, నగరాలు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్య పెంచినా నిధులు విడుదల చేయకపోవడంతో అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి.

ఉత్తుత్తి ప్రకటనలే..
విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్‌గా రూపాంతరం చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 53 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్‌ విజయవాడగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్‌లో తీర్మానం చేయించారు. కొన్ని పంచాయతీలు ఈ విలీనాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన కొంతకాలం బుట్టదాఖలైంది. ఈ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిశాక మళ్లీ గ్రేటర్‌ విజయవాడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చివరకు ఆ ప్రతిపాదనా కార్యరూపం దాల్చకుండానే సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి. మున్సిపల్‌ ఓటర్ల జాబితా తయారీ నేపథ్యంలో 2022 వరకు గ్రేటర్‌ ఆవిర్భావానికి సంబంధించి పంచాయతీల విలీనాన్ని పక్కన పెట్టాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి గ్రేటర్‌ విజయవాడకు మంగళం పలికింది.

అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థలో చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, శ్రీకాళహస్తి మండలాల్లోని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్‌ తిరుపతి చేస్తామని చేసిన ప్రకటనా కార్యరూపం దాల్చలేదు. అలాగే రాజధాని పరిధిలోని 29 గ్రామాలతోపాటు తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం, పెదపరిమి, వడ్డమాను గ్రామాలతో పాటు.. పరిసర మండలాలను కలిపి మెగా కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని గ్రామాల్లో లక్ష మంది జనాభానే ఉండటంతో పరిసర మండలాలు, మున్సిపాల్టీలను కలిపి కనీసం ఐదు లక్షల జనాభాకు తగ్గకుండా అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. ఇక గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో పట్టణీకరణ వైపు ప్రభుత్వం పరుగులు తీస్తోందని ప్రచారం చేశారు. మేజరు పంచాయతీల పక్కనే ఉన్న రెండు మూడు గ్రామ పంచాయతీలను కలిపి ఒక నగర పంచాయతీగా మార్పు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. దాదాపు 80 నగర పంచాయతీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీటి మీద రాతలా రివర్‌ ఫ్రంట్‌ టూరిజం
ప్రకాశం బ్యారేజీ డౌన్‌ స్ట్రీమ్‌ నుంచి కనకదుర్గ వారధి వరకు వరద నీటిని నిల్వ చేసి రివర్‌ ఫ్రంట్‌ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. కృష్ణానది కరకట్టలను ఇరువైపులా అభివృద్ధి చేసి, నదిలో బోట్‌ షికారు, ఇతర క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. విజయవాడ, తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు నగరాల్లో ఔటర్‌ రింగ్‌రోడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. రాజధానిలోని గ్రామాలను కలుపుతూ ఒక ఔటర్‌ రింగ్‌ రోడ్డు, తిరుపతిలో అలిపిరి నుంచి చంద్రగిరి, వడమాలపేట, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతిలను కలుపుతూ రింగ్‌రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. నెల్లూరులో మున్సిపల్‌ జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేసిన విధంగానే.. గ్రేటర్‌ విశాఖ పర్యవేక్షణలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు.

మరిన్ని వార్తలు