"కుల"కలం

21 Oct, 2017 12:14 IST|Sakshi

ఎస్టీ గుర్తింపు లేని ఏనేటి కోండ్రు కులస్తులు

1990 వరకు ఎస్టీలుగా కుల ధ్రువపత్రాలు

అనంతరం జారీ నిలిపివేసిన అధికారులు

శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులుగా గుర్తింపు

ప్రభుత్వ పథకాలకు బాధితులు దూరం

ఒకప్పుడు వారు గిరిజనులు. ఇప్పుడు కారు. ఒకప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించం పొమ్మంటోంది. అర్హత ఉన్నా గిరిజనులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గిరిజనులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. ఏనేటికోండ్రు కులం గిరిజనుల గోడును నిర్లక్ష్యం చేస్తోంది.

విజయనగరం, బలిజిపేట (పార్వతీపురం): నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న ఏనేటి కోండ్రు కులస్తులను ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గ్రామంలో 15 కుటుం బాలు వందేళ్లకు పైగా నివసిస్తున్నాయి. ఎస్టీలైన వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలసలోనూ గుర్తిస్తుండటం విశేషం. 1990 వరకు తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు ఇచ్చారని.. ఆ తర్వాతే నిలిపివేశారని కుల పెద్దలు నాగభూషణరావు, నీలకంఠం తెలిపారు. తమ కులస్తులు కొందరు చదువుకునేటప్పుడు ఎస్టీలుగానే గుర్తించి కులధ్రువీకరణ మంజూరు చేశారని, పాఠశాల టీసీల్లో కూడా ఎస్టీలుగా ధ్రువీకరించి ప్రస్తుతం కాదనడం సమంజసంగా లేదని తెలిపారు.

ఎందుకు గుర్తించరు?
నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న తమ కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని తమ కులస్తులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాయని ఎం.వెంకటరమణ, ఆర్‌.ఫకీరు, ఎం.గణపతి, మురళి తెలిపారు. కులపరంగా ఆచార సంప్రదాయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఎస్టీలం ఎలా కాకుండా పోతామని ప్రశ్నిస్తున్నారు.

అంధకారంలో పిల్లల భవిత
కుల ధ్రువపత్రాలకు నిరాకరిస్తుండటంతో 1990 అనంతరం పిల్లల చదువుల కోసం ఓసీలుగానే బడిలో చేర్పించి చదివిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామన్నారు. నిరుపేదలమైన తమకు జీవనాధారం కష్టమై పిల్లలను చదివించడం భారంగా ఉందని తెలిపారు. వేలకు వేలు చెల్లించలేక తక్కువ చదువులతో మాన్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగం కోల్పోయా
నాకు 2005లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం లేనందున వచ్చిన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నిరుత్సాహానికి గురయ్యాను. నేటికీ మేము ఏ కులస్తులమో అర్థం కావటం లేదు.         – ఎం.గణపతి, నారాయణపురం

పదోన్నతి రాలేదు
అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్న నాకు 2011లో సూపర్‌వైజర్‌గా పదోన్నతి లభించింది. కానీ కుల ధ్రువపత్రం లేనందున పదోన్నతి నిలిచిపోయింది. మా పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.       – ఎం.సరోజిని, నారాయణపురం

పరిశీలిస్తా
మీసేవలో కుల ధ్రువీకరణ నిమిత్తం దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అవకాశం ఉంటే సహకరిస్తాం. అన్నీ పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తాం.– బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట

మరిన్ని వార్తలు