‘వసతి’కి చెదలు!

10 Jun, 2015 04:23 IST|Sakshi
‘వసతి’కి చెదలు!

- దయనీయ స్థితిలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు
- మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత
- ప్రతిపాదనలు తెప్పించుకుని పట్టించుకోని ప్రభుత్వం
- ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,990 కేటాయింపు
- ఆ నిధులకూ ట్రెజరీలో అడ్డుకట్ట
- ఒక్కో బీసీ హాస్టల్‌కు రూ.30 వేలు ఖర్చు చేసి బిల్లు పెట్టాలని సూచన  
- డబ్బు లేదని చేతులెత్తేసిన బీసీ హెచ్‌డ బ్ల్యూఓలు
- ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ వసతి గృహాలు
కడప రూరల్
: జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు పడకేశాయి. సాధారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన రోజుల్లో ఆయా హాస్టళ్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరా, భవనాలకు సున్నం వేయడం, ఫ్లోరింగ్‌ను బాగు చేయడం, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలను బాగు చేయడం తదితర పనులు చేపట్టాలి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా మారాయి. అసౌకర్యాలతో పోరాడుతూనే హాస్టల్ విద్యార్థులు ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలను సాధించి తమ సత్తాను చాటుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఎస్సీ హాస్టళ్లు దయనీయం
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 143 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 14 వేల మంది వసతి పొందడానికి అవకాశం ఉండగా, గడిచిన 2014-15 విద్యా సంవత్సరంలో ఆ హాస్టళ్లలో పది వేల మంది విద్యార్థులు వసతి పొందారు. మొత్తం 143 హాస్టళ్లకుగాను 102 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 41 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మొదట రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా అధికారులు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొత్తగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానపుగదుల కొత్త భవనాల నిర్మాణంతోపాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, శ్లాబ్ తదితర శాశ్వత పనులు, మరమ్మత్తుల కోసం రూ. 6.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మైనర్ పనుల కింద తాత్కాలికంగా అత్యవసరంగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆ మేరకు అధికారులు 82 పనులకు రూ.3.55 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపా రు. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ప్రభుత్వ భవనాల్లో నడిచే హాస్టళ్లలో తాత్కాలిక, మౌలిక సదుపాయాల కోసం ఒక్కో హాస్టల్‌కు నామమాత్రంగా రూ.14,900 కేటాయించింది. అయితే, ఇందుకు సంబంధించి ట్రెజరీలో బిల్లులు మంజూరు కాకపోవడంతో హెచ్‌డబ్ల్యుఓలు చేసేది ఏమిలేక మిన్నకుండిపోయారు.

బీసీ హాస్టళ్లు దారుణం
జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 59 బాలబాలికల హాస్టళ్లు ఉన్నాయి. అందులో 38 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో, 21 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ హాస్టళ్లలో గడిచిన విద్యా సంవత్సరం ఏడు వేల మంది వరకు వసతి పొందారు. కాగా, ఈ సెలవుల్లో బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగమైన ఏపీఈడబ్ల్యుఐడీసీకి ఒక్కో హాస్టల్‌లో రూ.30 వేల వ్యయంతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ శాఖ ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కొనసాగించాలంటే ఆలస్యమవుతుందని సంకల్పించింది.

దీంతో ఆయా హాస్టల్ హెచ్‌డబ్ల్యుఓలే రూ.30 వేలను భరించి తమ హాస్టళ్లలో వసతుల కల్పన కోసం ఖర్చు పెడితే అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత ఖర్చు మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. అయితే, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (హెచ్‌డబ్ల్యుఓలు) తమ వద్ద అంత డబ్బు లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇదివరకే డైట్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఆ భారం తమపైన పడిందని, ఇప్పుడు అదనంగా రూ. 30 వేలను ఖర్చు చేయాలంటే ఏ విధంగా చేయాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఇద్దరు హెచ్‌డబ్ల్యుఓలు మాత్రమే రూ.30 వేలతో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది.

నిరుపేదల సంక్షేమం పట్టదా?
గతంలో ఏడాదికి రూ. 20 వేల చొప్పున కేటాయింపులు చేపట్టాలనే నిబంధన ఉం డేది. ఇప్పుడు అది కూడా లేదు. పైగా మెటీరియల్, కూలీల ఖర్చుకూడా అమాంతం పెరిగాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోతుందని హెచ్‌డబ్ల్యుఓలు ప్రశ్నిస్తున్నారు.

ప్రతిపాదనలు పంపాం: ప్రభుత్వ సూచనల మేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపాం. ఒక్కో ఎస్సీ హాస్టల్‌కు రూ. 14,900 మంజూరు చేసింది. ఆ డబ్బులు హెచ్‌డబ్ల్యుఓలకు అందాల్సి ఉంది. డబ్బులు అందగానే పనులు ప్రారంభిస్తాం.

మరిన్ని వార్తలు