అమరావతి రైతులకు అన్యాయం జరగదు

1 Feb, 2020 05:52 IST|Sakshi
వెలగపూడిలో అమరావతి రైతుల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి 

త్వరలో కమిటీ వస్తుంది.. దూరంగా ఉండొద్దు

రైతులందరూ తమ అభిప్రాయాలు చెప్పాలి

నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 

తుళ్లూరు రూరల్‌: అమరావతికి భూములు ఇచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి గ్రామాల్లో 45 రోజులుగా దీక్ష చేస్తున్న రైతుల వద్దకు శుక్రవారం ఆయన వెళ్లి వారితో మాట్లాడారు. భూ సమీకరణలో అమరావతికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగనివ్వం అని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే రైతుల వద్దకు కమిటీ వస్తుందని, వారి ఎదుట తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎంపీ సూచించారు. కమిటీకి దూరంగా ఉండొద్దని ఆయన కోరారు.

రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని గుర్తుచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు అధికారంలో ఉందంటే అందుకు రైతుల సహకారమే కారణమని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. గత మూడేళ్లుగా తనతో కలిసి పార్టీ కోసం పనిచేసిన వాళ్లు, తమ విద్యా సంస్థలో విద్యను అభ్యసించి ఉన్నత స్థితిలో ఉన్నవారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. మీ సహకారంవల్లే అధికారంలోకి వచ్చిన జగన్‌.. మిమ్మల్ని వదులుకునేదిలేదని ఆయన స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు