నీటి ఎద్దడి రానివ్వం

4 Mar, 2015 01:34 IST|Sakshi

ఏలూరు :జిల్లాలో రబీ పంటను సాగునీటి ఎద్దడి నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపడుతున్నట్టు  ఇరిగేషన్ ఏలూరు సర్కిల్ ఎస్‌ఈ బి.శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై మంగళవారం ఆయనను ప్రశ్నించగా, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిం చారు. కాలువలు, డ్రెయిన్లలో అడ్డుకట్టలు వేయడంతోపాటు పెద్దఎత్తున ఆయిల్ ఇంజిన్లు వినియోగించి నీటిని ఎత్తిపోస్తామని ఆయన పేర్కొన్నారు. వంతులవారీ విధానాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది రిటైర్డ్ లస్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగిస్తున్నామన్నారు. డ్రెయినేజీ డివి జన్ పరిధిలోని 25 మంది రెగ్యులర్ లస్కర్ల సేవలను అవసరమైన ప్రాం తాల్లో ఉపయోగిస్తున్నామని తెలిపారు. డెల్టాలో నీటిఎద్దడి గల శివారు ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
 
 జిల్లాలో కాలువలు, డ్రెయిన్లపై 127 చోట్ల అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించాలని నిర్ణయించామని గుర్తు చేశారు. అయితే, అంతమేరకు అవసరం లేకుండానే 30 చోట్ల అడ్డుకట్టలు వేసి 65 ఆయిల్ ఇంజిన్లు ఏర్పాట్లు చేసి శివారు ప్రాంతాలకు నీరిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల తూములను ఎత్తివేసి నీటిని అనధికారికంగా మళ్లిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ జరిపించేందుకు నిర్ణయించామని ఎస్‌ఈ వివరించారు. మూడు వారాల పాటు వంతులవారీ విధానంలో నీళ్లిస్తే పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఇప్పటివరకు వచ్చిన సమస్యలు పెద్దవి కానప్పటికీ, వాటిని అధిగమించి పంటలను పూర్తిస్థాయిలో రక్షించాలన్న కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సాగు చేపట్టిన 4.60 లక్షల ఎకరాల్లో 40 శాతం విస్తీర్ణంలో ముందుగానే నాట్లు పడ్డాయన్నారు. అక్కడ కోతలు పూర్తయితే శివారు ప్రాంతాలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
 
 సీలేరు నుంచి అదనపు జలాలు
 గోదావరి నుంచి 3,800 క్యూసెక్కుల ప్రవాహ జలాలు, సీలేరు నుంచి 4,900 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7,277 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎస్‌ఈ చెప్పారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీలేరు నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి కాలువలను కట్టివేస్తామని చెప్పారు. తాగునీటి అవసరాలకు మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు.
 
 ఎత్తిపోతలతో సాగునీరు
 ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)కి చెందిన ఎత్తిపోతల పథకం ద్వారా యలమంచిలి మండలంలోని శివారు ఆయకట్టులో 3వేల ఎకరాలకు సాగునీటిని మళ్లించే పనులను ప్రారంభించామని ఎస్‌ఈ తెలిపారు. నక్కల డ్రెయిన్ వద్ద 150 హెచ్‌పీ మోటార్లతో డ్రెయిన్ నీటిని మళ్లిస్తామన్నారు. మొగల్తూరు మండలంలోని ఎత్తిపోతల పథకానికి రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి శేరేపాలెం, కొప్పర్రు ప్రాంతాలకు ఆయిల్ ఇంజిన్లు ద్వారా పంపింగ్ చేస్తామని చెప్పారు.
 
 నేడు కలెక్టర్ సమీక్ష
 రబీ పంటకు నీటి సరఫరా విషయమై కలెక్టర్ కె భాస్కర్ బుధవారం సమీక్షించనున్నారు. ఇందులో మండల, డివిజన్ స్థాయిలో నీటిని సరఫరాపై గస్తీ బృందాల ఏర్పాటు, ఎత్తిపోతల నుంచి నీటి మళ్లింపుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
 కృష్ణా నుంచి 300 క్యూసెక్కుల మళ్లింపు
 గోదావరి కాలువ కింద శివారు ప్రాంతాలకు తూర్పులాకుల నుంచి 300 క్యూసెక్కుల కృష్ణా నీటిని ప్రజాప్రతినిధుల చొరవతో వెనక్కి మళ్లిస్తున్నామని చెప్పారు. దెందులూరు, కొవ్వలి, పొతునూరు చానల్, భీమడోలు, పూళ్ల ప్రాంతాలకు కూడా ఈ నీటిని రెండు రోజుల్లో మళ్లించే అవకాశం ఉందన్నారు.
 
 నీటిని క్రమశిక్షణతో వాడుకోవాలి
 రానున్న కాలంలో పంటను కాపాడుకునేందుకు రైతులు క్రమశిక్షణ పాటించి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఎస్‌ఈ శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుని దుర్వినియోగం చేయకుండా, అవసరాల మేరకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు నాటి వరకు రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు