ఖరీఫ్‌కు విత్తనాలేవీ?

7 May, 2014 00:58 IST|Sakshi


ముంచుకొస్తున్న సీజన్ ధరలు, టెండర్ల ప్రక్రియపై ఖరారు కాని విధానం
 
 సాక్షి, హైదరాబాద్: వ్యవసాయు సీజన్ ముంచుకు వస్తున్నా...అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. తొలకరి వర్షాలు రావడానికి ఇంక ఎంతో దూరం లేదు. ఆలోపే రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. అయితే, ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలకు సంబంధించిన ధరలనే ఖరారు చేయలేదు.
 
 ఇందుకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేయలేదు. దీంతో విత్తనాల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. ఒక పక్క రాష్ర్ట విభజన ప్రక్రియ కొనసాగుతుండడం, మరో పక్క ఎన్నికలు జరుగుతుండడంతో దీనిపై సకాలంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫైలు అనుమతి కోసం ఉన్నతాధికారుల వద్ద ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 12.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ. 255 కోట్లతో వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.  దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దాంతో విత్తనాల సరఫరాకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. ఈ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థతో పాటు ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా వంటి సంస్థలు అందిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు కూడా ప్రైవేట్‌లోనే విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక టెండర్లను ఆహ్వానిస్తారు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను అవసరాన్ని బట్టి ఆయా జిల్లాలకు చేరవేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియడానికి కొంత సమయం పట్టనుండగా, ఇప్పటి వరకు విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం విధానాన్నే ప్రకటించలేదు.
 
 రాష్ట్రంలోకి రుతుపవనాలు ముందుగా ఆదిలాబాద్, నిజామాబాద్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రాంతంలో  సోయాబీన్ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలకు డిమాండ్ ఉంటుంది. జూన్ మొదటి వారంలోనే ఆయా ప్రాంతాల్లో విత్తనాలను నాటుతారు. అంటే ఈ నెలఖరులోగా విత్తనాలను రైతులకు చేరవేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే గడువులోపు విత్తనాల సరఫరా జరిగే అవకాశం కనిపించడం లేదు. గతంలోనూ సోయాబీన్ విత్తనాల సరఫరా సకాలంలో జరగకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు విత్తనాల ధరలను భారీగా పెంచే ప్రమాదం ఉంది. ఈసారి నూనె గింజలకు సంబంధించిన విత్తనాలను 33 శాతం సబ్సిడీపై, పప్పుధాన్య రకాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఇంకా తుది ధరలను ఖరారు చేయకపోవడంతో రైతులు ఎంత చెల్లించాలనే విషయంలో స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు