మాఫీ లేదు..రివాల్వింగ్ ఫండే!

27 Aug, 2014 03:04 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని తేలిపోయింది. స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న లింకేజీ రుణాలు మాఫీ లేదని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రుణాల మాఫీ లేదని ఐకేపీ సిబ్బంది స్పష్టంగా చెబుతోంది. దీంతో డ్వాక్రా మహిళలు ఆందోళన బాట పడుతున్నారు.

అయితే ‘తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించండి.. లేదంటే చర్యలు తీసుకుంటాం. బకాయిలు చెల్లిస్తే.. మీకు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం’ అంటూ ఎస్‌హెచ్‌జీ మహిళలపై ఐకేపీ సిబ్బంది తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.  ఆ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో ఏప్రిల్ నుంచి లింకేజీ రుణాల నెలవారీ కంతులను చెల్లించడం మానేశారు.

ప్రస్తుతం తీసుకున్న రుణాలు, వాటికి వడ్డీ చెల్లించకపోతే రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ పొందేందుకు సంఘానికి అర్హత లేదని తేల్చిచెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. నమ్మి ఓట్లేస్తే.. దారుణంగా మోసం చేశారని టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. పొదుపు మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని తుంగలో తొక్కారని వారు విమర్శిస్తున్నారు.

 ఇదీ పరిస్థితి..
 జిల్లాలో 42వేలకుపైగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అందులో 4 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరంతా వివిధ బ్యాంకుల్లో రూ.525 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఒక్కో సంఘం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకుంది. తీసుకున్న రుణాలకు సంబంధించి కంతుల వారీగా ప్రతి నెలా రూ. వెయ్యి నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి 5 నెలల మొత్తం అంటే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఒకేసారి చెల్లించాలని  ఐకేపీ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు.

 ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారంలోకి రాకమునుపు మహిళలకు సంబంధించిన రుణాలన్నింటిని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు విస్పష్టంగా ప్రకటించి ఇప్పుడు చెల్లించమనటం అన్యాయమని సభ్యులు మండిపడుతున్నారు. అయితే ప్రతి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తానని పేర్కొన్నారు. ఈ లక్ష రూపాయలు ఎప్పుడు సంఘాలకు చెల్లిస్తారో కూడా చెప్పలేదు. ప్రతి సంఘం లక్ష రూపాయల రివాల్వింగ్ ఫండ్ పొందడానికి కూడా షరతులు పెట్టారు. ఏప్రిల్ నుంచి చెల్లించకుండా ఉండిపోయిన అన్ని నెలల బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిబంధన పెట్టారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

 ఎక్కడి నుంచి తేవాలి..
 ఏప్రిల్ నుంచి అన్ని నెలల బకాయిలను ఒకేసారి చెల్లించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని కర్నూలుకు చెందిన శశిరేఖ ప్రశ్నించారు. మొన్నటి వరకు జిల్లాలో వర్షాలు కురవకపోవటంతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయని హాలహర్వికి చెందిన చంద్రమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా ప్రయోజనం లేదని బోరుమన్నారు. ఈ పరిస్థితుల్లో బకాయి పడిన మొత్తాలను చెల్లించాలంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చినట్లు రుణాలు మాఫీ చేయకపోతే టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు