అంతన్నారు.. ఇంతన్నారు..!

16 Mar, 2017 15:34 IST|Sakshi
అంతన్నారు.. ఇంతన్నారు..!

► బడ్జెట్‌లో వంశధారకు మొండిచెయ్యి
► నెరవేరని మంత్రుల హామీలు


ఎల్‌.ఎన్‌.పేట : ‘వంశధార రిజర్వాయర్‌ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేస్తాం. ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2017 జూన్‌ (ఖరీఫ్‌) నాటికి వంశధార నుంచి సాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు నిర్వాసితులు సహకరించాలి...’ ఈ ఏడాది జనవరి 24న వ్యవసాయశాఖ మంత్రి దేవినేని ఉమ, జిల్లా మంత్రి అచ్చెన్న, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్‌నాయుడులు కొత్తూరు, హిరమండలం మండలాల్లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. అయితే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో 2017–18 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో వంశధార పేరు ప్రస్తావనకే రాలేదు.  బడ్జెట్‌ పద్దులో 32వ పేజీలో పొందు పర్చిన జలవనరుల విభాగంలో 96 నుంచి 101 ఉన్న అంశాల్లో వంశధార ప్రస్తావనే లేదు. ఆదే ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు వంశధార పనులకు, నిర్వాసితులకు ఇచ్చే పరిహారానికి నిధుల సమస్యేలేదని చెపుతుండటం, ఆర్థిక మంత్రి నిధులే కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 60 శాతం నిధులు అదనంగా కేటాయించామని ఆర్థికమంత్రి చెపుతున్న మాటలకు వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న 7 పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. పట్టిసీమ, తోటపల్లి బ్యారేజ్, గండ్లకమ్మ రిజర్వాయరు, పోలవరం ఆర్‌ఎంఎస్‌సిలతో పాటు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి ఇచ్చిన ప్రాధాన్యం వంశధారకు లేకుండాపోయింది. నిధులు కేటాయింపే లేకుండా నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి సాగునీరు ఎలా ఇవ్వగలరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరో రూ.650 కోట్లు కావాలి..: వంశధార ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏటా పెరిగిపోతోంది. గత ఏడాది కేవలం రూ.92 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు. నిర్వాసితులకు 2013 ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం వివిధ రకాల ప్యాకేజీలు చెల్లించేందుకు రూ.1200 కోట్లు అవసరం. 25 శాతం మిగిలి ఉన్న పనులు పూర్తి చేసేందుకు మరో రూ.650 కోట్ల పైనే నిధులు అవసరమవుతాయని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. వంశధార పేరుతో ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా సాగునీటి వనరులు (ఇరిగేషన్‌)కు మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

మోసం చేశారు..: వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసి ఈ ఏడాది జూన్‌కు సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు హామీలు గుప్పించారు. వీరి మాటలు, బడ్టెట్‌ కేటాయింపులు చూస్తే జిల్లా రైతులకు, నిర్వాసితులకు మోసం చేసేలా ఉన్నాయి. – రెడ్డి శాంతి, వైఎస్సార్‌ సీసీ జిల్లా అధ్యక్షురాలు.

మరిన్ని వార్తలు