స్వర్గంలో ఉన్న ‘అమ్మ రమ్మంటుంది’ అంటూ...

27 Feb, 2014 08:15 IST|Sakshi
స్వర్గంలో ఉన్న ‘అమ్మ రమ్మంటుంది’ అంటూ...

తండ్రి మరణించాడు... కొన్నాళ్లకు తల్లీ మరణించింది... విధి ఆ చిన్నారులను ఆనాధలను చేసింది. వారిని చేరదీసిన నాయనమ్మే అన్నీయై చూసుకుంది. కానీ ఆ తల్లిని మరిపించలేకపోయింది. దీంతో స్వర్గంలో ఉన్న ‘అమ్మ రమ్మంటుంది’ అంటూ... లేఖ రాసిపెట్టి పన్నేండేళ్లు వయస్సున్న ఆ చిన్నారి కన్నుమూసింది.

దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన మౌనిక అనే చిన్నారి ఆత్మహత్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తల్లిదండ్రులు మరణించడంతో ఆ చిన్నారులు ఆనాధలవ్వడం, వారి పేదరికం, ఆ కుటుంబం దైన్యంపై ‘సాక్షి’ గతంలో పలు కథనాలను ప్రచురించింది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు, మానవ, ధృక్పథం గల పలువురు ఆసరా కూడా అయ్యారు.

కానీ కమ్మనైన అమ్మప్రేమను ఎవరు మరిపించగలరు? అందుకేనేమో అమ్మ ఆలోచనలతో ఆ పన్నెండెళ్ల చిన్నారి మూడు రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా.. తాటికోల్ గ్రామానికి చెందిన శ్రీను-అలివేలు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీను సారాకు బానిసై రెండు కిడ్నీలు చెడిపోవడంతో పేదరికంతో వైద్యం చేయించుకోలేక 8 ఏళ్ల క్రితం మరణించాడు. దీంతో ముక్కుపచ్చలారని ఆ ఇద్దరి చిన్నారుల బాధ్యత ఆ తల్లిపై పడింది. కూలి పనిచేసి ఉన్నదాంట్లో ఆ ఇద్దరు పిల్లలను సాకింది. కానీ, విధి వక్రించడంతో ఆ చిన్నారుల తల్లి అలివేలుకు క్యాన్సర్ సొకి గత ఏడాదే చనిపోయింది.

దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. కనీసం తిండికి కూడా లేని పరిస్థితి. తల్లిదండ్రుల మరణంతో ఆనాధలైన ఆ చిన్నారుల ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో కొంతమంది దాతలు ఆ కుటుంబానికి ఆసరా అయ్యారు. అలివేలు పెద్ద కుమార్తె రూప 10వ తరగతి పూర్తి చేసి, ఇంటర్ చదవలేకపోతుండడం, చిన్న కుమార్తె మౌనిక బాధ్యత నాయనమ్మ నర్సమ్మకు భారంగా మారడంతో వారి దీనావస్థపై ‘సాక్షి’ మళ్లీ కథనం ప్రచురించింది.
దీంతో ఓ సంస్థ రూపను ప్రైవేట్ కళాశాలలో చదివించడానికి ముందుకొచ్చారు. మౌనికను దేవరకొండలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చేర్పించారు.

స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వారికి రేషన్ కార్డు మంజూరు చేయడంతోపాటు రూ.5వేల ఆర్థిక సహయం అందజేశారు. దీంతో పాటు వారితో బ్యాంక్ అకౌంట్ తీయించి తన స్నేహితుల ద్వారా సహాయానికి పూనుకున్నారు. కానీ, ఇంతలోపే మరో అనర్ధం జరిగిపోయింది.
తల్లి జ్ఞాపకాలను మరిచిపోని ఆ పసి హృదయం ప్రతి రోజు కలవరించింది. తల్లిలేని ఈ లోకంలో నేనుండలేనంటూ మదనపడింది. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసింది. అక్కను మంచిగా చూసుకోండంటూ లేఖలో నాయనమ్మకు బాధ్యతలు అప్పగించింది. నాకు ఇప్పుడే తృప్తిగా ఉందంటూ లేఖ వదిలి ఇంటికి వెళ్లివస్తానని పాఠశాలలో చెప్పి నాయనమ్మ దగ్గరకు వెళ్లింది. నాయనమ్మ బయట ఉన్న సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

 ఒకటి, రెండూ, మూడు...
 ఒకటి, రెండూ, మూడు... చూస్తుండగానే మూడు ప్రాణాలు పేదరికంలో కొట్టుమిట్టాడి ఓడిపోయి మరణించాయి. ఇక మిగిలింది 80 సంవత్సరాల వృద్దాప్యంతో పోటీపడుతున్న నాయనమ్మ నర్సమ్మ.., తల్లి, తండ్రి.. నిన్నమొన్నటి వరకు కలిసిమెలిసి తనతో కలిసి తిరిగిన చెల్లాయిని పోగొట్టుకున్న రూప మాత్రమే. అయితే వీరిని ఆదుకోవాల్సిన అధికారులు ఆర్థిక సహాయం వరకే తమ బాధ్యతగా భావిస్తున్నారు. కానీ, వారికి ఈ వయస్సులో కావాల్సింది ఆర్థిక సాయం కాదు.. మేమున్నామనే మనోైధైర్యం. భవిష్యత్తుకు భరోసా. రూప జీవితానికైనా మంచి భవిష్యత్తుంటుందని ఆకాంక్షిద్దాం.

మరిన్ని వార్తలు